Arnav Gupta: గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసిన ఘోరం.. 'మర్డర్' మెసేజ్‌తో టెక్కీకి షాక్!

Uber Drivers Message Murder Shocks Techie Due to Translation Glitch
  • క్యాబ్ డ్రైవర్‌ను రెండు నిమిషాలు ఆగమని కోరిన టెక్కీ
  • డ్రైవర్ నుంచి 'హత్య బెదిరింపు' అంటూ వచ్చిన మెసేజ్
  • భయంతో వణికిపోయిన యువకుడు
  • అనువాదంలో పొరపాటు జరిగిందని ఆలస్యంగా గుర్తింపు
  • 'మదర్ డెయిరీ' ముందున్నానని చెప్పిన డ్రైవర్
సాధారణంగా బుక్ చేసుకున్న ఓ ఉబర్ క్యాబ్ రైడ్ ఒక టెక్కీకి ఊహించని షాక్ ఇచ్చింది. తన డ్రైవర్ నుంచి 'హత్య బెదిరింపు ఎదుర్కొంటున్నాను' అనే మెసేజ్ రావడంతో అతను నిలువెల్లా వణికిపోయాడు. కానీ, టెక్నాలజీ చేసిన చిన్న పొరపాటు వల్లే ఆ గందరగోళం జరిగిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

ఢిల్లీకి చెందిన ఆర్నవ్ గుప్తా అనే టెక్కీ ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వస్తున్నందున రెండు నిమిషాలు ఆగమని డ్రైవర్‌కు యాప్‌లో మెసేజ్ పెట్టాడు. కొద్దిసేపటికే ఉబర్ యాప్ నుంచి 'I am facing the threat of murder' (నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు) అని నోటిఫికేషన్ వచ్చింది.

ఆ మెసేజ్ చూడగానే గుప్తాకు వెన్నులో వణుకు పుట్టింది. "అది ఢిల్లీ కావడంతో ఏమైనా జరగొచ్చని భయపడ్డాను. ఆగమన్నందుకే డ్రైవర్ ఇలా బెదిరిస్తున్నాడా? లేక అతనికి ఎవరినుంచైనా ప్రమాదం ఉందా? అని క్షణాల్లో ఎన్నో ఆలోచనలు వచ్చాయి" అని గుప్తా తన ఎక్స్ ఖాతాలో రాశాడు.

భయంతో వణుకుతున్న చేతులతో యాప్‌లో చాట్ ఓపెన్ చేసి చూడగా, అనుమానంతో ఆ బెదిరింపు మెసేజ్‌ను జాగ్రత్తగా గమనించాడు. అది గూగుల్ ద్వారా ఆటో-ట్రాన్స్‌లేట్ అయిందని గ్రహించాడు. వెంటనే 'See original' (అసలు మెసేజ్ చూడండి) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయగా అసలు విషయం బయటపడింది. హిందీలో డ్రైవర్ పంపిన అసలు మెసేజ్ 'Murder deri ke saamne hu' (మర్డర్ డెయిరీ కే సామ్నే హు) అని ఉంది.

దాని అసలు అర్థం 'నేను మదర్ డెయిరీ ముందు ఉన్నాను' అని. యాప్ 'మదర్' పదాన్ని పొరపాటున 'మర్డర్'గా అనువదించడంతో ఈ గందరగోళం జరిగింది. ఈ ఫన్నీ సంఘటనను గుప్తా స్క్రీన్‌షాట్‌లతో సహా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఆటో-ట్రాన్స్‌లేషన్ పొరపాటుపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌తో హోరెత్తించారు.

   
Arnav Gupta
Uber
Google Translate
Delhi
Mother Dairy
Translation Error
Cab Ride
Viral Post
Techie
Social Media

More Telugu News