Siva Jyothi: తిరుమల ప్రసాదంపై వ్యాఖ్యలు... క్షమాపణలు చెప్పిన యాంకర్ శివజ్యోతి

Siva Jyothi Apologizes for Tirumala Prasadam Comments
  • తిరుపతి ప్రసాదంపై వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతి
  • సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు
  • నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవమంటూ అంగీకారం
  • వీడియో విడుదల చేసి తన ఉద్దేశాన్ని వివరించిన శివజ్యోతి
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ప్రముఖ యాంకర్ శివజ్యోతి.. ఇటీవల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆమె మాటలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ వెల్లువెత్తడంతో, శివజ్యోతి తాజాగా ఓ వీడియో విడుదల చేసి బేషరతుగా క్షమాపణలు తెలిపారు.
 
ఇటీవల తిరుపతి దర్శనం, ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె, తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. "పొద్దున్నుంచీ తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందిని బాధించాయి. వివరణ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ చెబుతున్నాను," అని ఆమె పేర్కొన్నారు.
 
తాము రూ.10,000 ఖరీదైన ఎల్1 క్యూ లైన్‌లో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నానని, అంతేకానీ ‘మేము ధనవంతులం’ అనే అహంకారంతో కాదని ఆమె స్పష్టతనిచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు. "నాకు అత్యంత విలువైన నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామే ఇచ్చాడు. అలాంటిది ఆయన గురించి నేనెలా తప్పుగా మాట్లాడతాను?" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
 
"నా ఉద్దేశం అది కాకపోయినా, నా మాటలు తప్పుగా ఉన్న మాట వాస్తవం. యూట్యూబ్ ఛానెళ్లు, కేసుల భయంతో కాకుండా, అలా మాట్లాడి ఉండకూడదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు," అని శివజ్యోతి స్పష్టం చేశారు. ఆమె క్షమాపణతో ఈ వివాదం సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు.
Siva Jyothi
Anchor Siva Jyothi
Tirumala Prasadam
Tirupati
L1 Queue
Venkateswara Swamy
Apology
Social Media Controversy

More Telugu News