ఇప్పుడు డబుల్ హనీమూన్... బిగ్‌మూన్, మినీమూన్... అసలేమిటీ ట్రెండ్?

  • పెళ్లి తర్వాత కొత్త జంటలు రెండు హనీమూన్‌లు ప్లాన్ చేస్తున్న వైనం
  • వివాహం జరిగిన వెంటనే వెళ్లే చిన్న ట్రిప్పును 'మినీ-మూన్' అంటున్న జంటలు 
  • కొన్ని నెలల తర్వాత వెళ్లే పెద్ద ట్రిప్పు 'బిగ్-మూన్'
  • లగ్జరీ కన్నా అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్న నవ దంపతులు
  • థ్రిలోఫిలియా ట్రావెల్ నివేదికలో ఈ కొత్త ట్రెండ్ వెల్లడైంది
పెళ్లి అంటేనే ఓ పెద్ద వేడుక. వారాల తరబడి సాగే హడావుడి, బంధుమిత్రుల సందడి, ఆచారాలు, సంప్రదాయాలతో అలసిపోయిన నవ దంపతులు సేద తీరడానికి వెళ్లేదే హనీమూన్. ఒకప్పుడు హనీమూన్ అంటే పెళ్లైన వెంటనే ఎంచక్కా ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవడమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆధునిక జంటలు ఒకటికి రెండు హనీమూన్‌లను ప్లాన్ చేసుకుంటున్నాయి. ఒకటి పెళ్లైన వెంటనే సేద తీరడానికి వెళ్లే 'మినీమూన్' కాగా, మరొకటి కొన్ని నెలల తర్వాత పక్కా ప్రణాళికతో వెళ్లే 'బిగ్‌మూన్'. ఈ ఆసక్తికరమైన విషయాన్ని ప్రముఖ ఇండియన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ 'థ్రిలోఫిలియా' తన 'హనీమూన్ ట్రావెల్ రిపోర్ట్ 2025-26'లో వెల్లడించింది.

ఏమిటీ 'మినీమూన్', 'బిగ్‌మూన్'?

థ్రిలోఫిలియా నివేదిక ప్రకారం, పెళ్లి తంతు ముగిసిన వెంటనే కొత్త జంటలు 3 నుంచి 5 రోజుల పాటు దగ్గర్లోని ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి సేద తీరుతున్నారు. దీనినే 'మినీమూన్' అని పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ ఏడాదికి 18 శాతం చొప్పున పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మొదటి ఏడాదిని ఎలా జరుపుకోవాలనే విషయంలో యువత ఆలోచనల్లో వస్తున్న మార్పులకు ఇది నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మినీమూన్ ద్వారా పెళ్లి అలసట నుంచి త్వరగా కోలుకుని, మళ్లీ తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. దీనికోసం ఎక్కువ రోజులు సెలవులు పెట్టాల్సిన అవసరం లేకపోవడం, ప్రయాణ ఏర్పాట్లు సులభంగా ఉండటం వంటివి దీని పెరుగుదలకు ప్రధాన కారణాలు.

ఇక పెళ్లైన కొన్ని నెలల తర్వాత, ఇద్దరూ కలిసి తమకు నచ్చిన ప్రదేశానికి, ఓ పక్కా ప్రణాళికతో సుదీర్ఘంగా వెళ్లే ట్రిప్‌ను 'బిగ్‌మూన్'గా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో దంపతులు తమ అభిరుచులను, ఇష్టాయిష్టాలను చర్చించుకుని, తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఓ మంచి డెస్టినేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అది విదేశీ యాత్ర కావచ్చు, దేశంలోనే అన్వేషించని కొత్త ప్రదేశం కావచ్చు. ఈ ప్రయాణం వారికి మరింత లోతైన, మధురమైన అనుభూతిని అందిస్తుందని నివేదిక పేర్కొంది.

అనుభవాలకే పెద్దపీట

ఈ రెండు రకాల హనీమూన్‌లలోనూ నవ దంపతులు కేవలం విలాసవంతమైన బస కన్నా, వినూత్నమైన అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని థ్రిలోఫిలియా సర్వేలో తేలింది. సుమారు 64 శాతం జంటలు సూర్యాస్తమయం వేళ పడవ ప్రయాణాలు (సన్‌సెట్ క్రూజ్‌లు), ప్రైవేట్ విల్లాలో బస, బీచ్ ఒడ్డున డిన్నర్లు వంటి రొమాంటిక్ అప్‌గ్రేడ్‌లను ఇష్టపడుతున్నారు. అదేవిధంగా, 42 శాతం జంటలు తమ ప్రయాణంలో స్నార్కెలింగ్, జిప్‌లైనింగ్, మంచుతో ఆడుకోవడం, ఎడారిలో నక్షత్రాలను చూడటం వంటి సాహస క్రీడలతో పాటు ఆయుర్వేద రిట్రీట్స్ వంటి వెల్‌నెస్ సెషన్‌లను కూడా చేర్చుకుంటున్నారు.

ప్రముఖ హనీమూన్ డెస్టినేషన్లు

భారత్‌లో కేరళ, అండమాన్, గోవా, రాజస్థాన్ వంటి ప్రదేశాలు ప్రకృతి, సంస్కృతుల కలయికతో రెండు రకాల హనీమూన్‌లకు ప్రముఖ గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ఏకాంతాన్ని, ప్రశాంతతను కోరుకునే జంటలు హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, కూర్గ్ వంటి ఆఫ్-బీట్ ప్రాంతాలకు వెళుతున్నారు. అంతర్జాతీయంగా థాయ్‌లాండ్, వియత్నాం, బాలి, మాల్దీవులు టాప్ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. మొత్తం మీద, ఆధునిక జంటలు తమ వైవాహిక జీవితపు తొలి అడుగులను ఒక తక్షణ విశ్రాంతితో, ఆ తర్వాత ఒక గొప్ప సాహసయాత్రతో జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


More Telugu News