పోలీస్ కస్టడీకి వైసీపీ నేత, ఎన్నారై భాస్కర్ రెడ్డి

  • వైసీపీ ఎన్నారై నేత మాలపాటి భాస్కర్ రెడ్డికి రెండు రోజుల కస్టడీ
  • చంద్రబాబు, పవన్‌పై అసభ్య పోస్టుల కేసులో విచారణ
  • ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులకు రెండ్రోజులకే కోర్టు అనుమతి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎన్నారై మాలపాటి భాస్కర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.

లండన్‌లో నివాసముంటున్న భాస్కర్ రెడ్డి, గత మూడేళ్లుగా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంకు చెందిన ఆయన, ఇటీవల తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో ఆయనను ఈ నెల 21 వరకు రిమాండ్‌కు తరలించగా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో ఖైదీగా ఉన్నారు.

రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని అభ్యర్థించారు. పోలీసుల వాదనలు విన్న న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెల్లూరు జిల్లాలోనే పోలీసులు ఆయన్ను విచారించనున్నారు.


More Telugu News