Nobel Peace Prize: అజ్ఞాతంలో మరియా.. నోబెల్ అందుకునేదెలా!

Maria Corina Machado Faces Hurdles Receiving Nobel Peace Prize
  • నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీతకు చిక్కులు
  • నార్వేలో డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాల ప్రధానం
  • బహుమతి కోసం వెళితే మరియాను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామన్న వెనెజువెలా
వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక బహుమతి నోబెల్ శాంతి పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అయతే, ఈ పురస్కారాన్ని అందుకోవడంలో మరియా కొత్త చిక్కులను ఎదుర్కొంటున్నారు. నోబెల్ పురస్కారాలను డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే విషయంలో మరియాకు ఇబ్బందులు తప్పడంలేదు. వెనెజువెలా ప్రభుత్వ ఆంక్షల కారణంగా ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. నోబెల్ అందుకోవడానికి నార్వేకు వెళితే మరియాను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని తాజాగా వెనెజువెలా అటార్నీ జనరల్ ప్రకటించారు. దేశాధ్యక్షుడిపై ప్రజల్లో విద్వేషాన్ని ప్రేరేపించడం, ప్రభుత్వంపై కుట్ర, ఉగ్రవాదం సహా పలు ఆరోపణలు మరియాపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈమేరకు అటార్నీ జనరల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మరియాపై పలు ఆరోపణలు చేశారు. వెనెజువెలా చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో అమెరికా సైనిక దళాల మోహరింపునకు మరియా మద్దతునిచ్చారని ఆరోపిస్తూ ఈ విషయంలో ఆమెపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే నోబెల్ పురస్కారం కోసం మరియా వెనెజువెలా దాటి వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

కాగా, వెనెజువెలా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నందుకు మరియాను ఈ ఏడాది శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనెజువెలాలో ప్రజాస్వామ్యం ఏర్పాటుకు ఆమె విశేష కృషి చేస్తున్నారని కొనియాడింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి, అధ్యక్షుడి నుంచి ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ మరియా వెనక్కి తగ్గలేదని పేర్కొంది. అజ్ఞాతంలో ఉంటూనే ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని మరియాను ప్రశంసించింది.
Nobel Peace Prize
Maria Corina Machado
Venezuela
Venezuelan opposition leader
Norway
Venezuelan Attorney General
political asylum
human rights
democracy

More Telugu News