Amala Akkineni: అక్కినేని అమల వ్యక్తిగత జీవితం.. ఎవరికీ తెలియని నిజాలు!

Amala Akkineni Personal Life Unknown Facts
  • అమల అమ్మ ఐరిష్... నాన్న బెంగాలీ
  • చిన్నప్పుడు ఇంట్లో పనులన్నీ తామే చేసుకునేవాళ్లమని చెప్పిన అమల
  • క్లాసికల్ డ్యాన్సర్‌గా ఉండగా సినిమాల్లోకి అవకాశం వచ్చిందని వెల్లడి
ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున సతీమణి అమల తన గతం గురించి, కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాగార్జున, అమల జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ 36 ఏళ్ల తర్వాత ఇటీవల రీ-రిలీజ్ అయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన తండ్రి బెంగాల్ విభజన సమయంలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చారని ఆమె భావోద్వేగంగా తెలిపారు.

“మా అమ్మ ఐరిష్, నాన్న బెంగాలీ. బెంగాల్ విభజన సమయంలో మా ఆస్తులన్నీ పోయాయి. బాగా చదువుకుంటేనే జీవితంలో పైకి రాగలనని నమ్మిన నాన్న, కష్టపడి చదివి యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించారు. ఆయన తన తొమ్మిది మంది తోబుట్టువుల బాధ్యతను కూడా చూసుకున్నారు” అని వివరించారు. తన తల్లిదండ్రులిద్దరూ నౌకాదళంలో పనిచేయడం వల్ల తరచూ ఊళ్లు మారేవాళ్లమని, వైజాగ్‌లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నానని చెప్పారు.

తన డ్యాన్స్ టీచర్ సలహాతో 9 ఏళ్ల వయసులో చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరానని, 19 ఏళ్ల వరకు అక్కడే చదువుకున్నానని అమల తెలిపారు. “మా ఇంట్లో పనివాళ్లు ఉండేవారు కాదు. గిన్నెలు తోమడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వంట చేయడం వంటి పనులన్నీ మేమే చేసుకునేవాళ్లం” అని ఆమె తన నిరాడంబరమైన పెంపకం గురించి వెల్లడించారు. దర్శకుడు టి. రాజేందర్ తన సినిమా కోసం క్లాసికల్ డ్యాన్సర్ కోసం వెతుకుతూ కళాక్షేత్రకు రావడంతో ‘మైథిలి ఎన్నయి కథలై’ చిత్రంతో హీరోయిన్‌గా మారానని, ఆ సినిమా విజయంతో వెనుదిరిగి చూసుకోలేదని అన్నారు.

ఇక అక్కినేని కుటుంబం గురించి మాట్లాడుతూ, అత్తగారు అన్నపూర్ణమ్మ తనను కూతురిలా చూసుకున్నారని, ఆమె దగ్గరే తెలుగు స్పష్టంగా నేర్చుకున్నానని తెలిపారు. నాగచైతన్య, అఖిల్ విషయంలో తాము జోక్యం చేసుకోమని, వారి నిర్ణయాలకే వదిలేస్తామని స్పష్టం చేశారు. తనకు మంచి కోడళ్లు దొరకడం తన అదృష్టమని అమల ఆనందం వ్యక్తం చేశారు. 
Amala Akkineni
Akkineni Nagarjuna
Shiva Movie
Bengali Partition
Annapurna Akkineni
Naga Chaitanya
Akhil Akkineni
Mythili Ennai Kathali
Telugu Cinema
Classical Dance

More Telugu News