Ibomma Ravi: ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు.. మరింత బిగుస్తున్న ఉచ్చు!

Ibomma Ravi Case Telangana CID Enters Investigation
  • ఐబొమ్మ రవి కేసు దర్యాప్తులో సీఐడీ అధికారులు ప్రవేశం
  • ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ల ప్రమోషన్ కోణంలో విచారణ
  • మూడో రోజు కస్టడీకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
  • రవికి సహకరిస్తున్న వారి వివరాలపై పోలీసుల ఆరా
  • సీఐడీ ఎంట్రీతో కేసు విచారణ మరింత వేగవంతం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులోకి తాజాగా తెలంగాణ సీఐడీ అధికారులు ప్రవేశించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై సీఐడీ దృష్టి సారించింది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఈ కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నిందితుడు రవికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది.

మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ‌ కూడా విచారణ కొనసాగనుంది. నిన్న‌ దాదాపు ఆరు గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మకు కొత్త సినిమాలను ఎవరు సరఫరా చేస్తున్నారు? అతనికి సహకరిస్తున్న ఏజెంట్లు ఎవరు? గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు సీఐడీ కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రెండు ఏజెన్సీల దర్యాప్తుతో రవికి సహకరించిన వారికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.


Ibomma Ravi
Ibomma
Telugu Movies
Online Gaming
Betting Sites
CID Investigation
Cyber Crime
Hyderabad Cyber Crime Police
Ravi Arrest

More Telugu News