Teenmaar Mallanna: ఐబొమ్మ రవి దమ్మున్నోడు.. దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి: సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్

Teenmaar Mallanna Challenges Sajjanar on Ibomma Ravi Arrest
  • ఐబొమ్మ రవి అరెస్టు వ్యవహారానికి రాజకీయ రంగు
  • సీపీ సజ్జనార్‌ను లక్ష్యంగా చేసుకుని తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు
  • రవి దమ్మున్నోడని, సజ్జనార్‌వి ఫేక్ ఎన్‌కౌంటర్లు అని ఆరోపణ
  • మల్లన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఐబొమ్మ రవి దమ్మున్నవాడని, అందుకే అతనికి ప్రజల మద్దతు ఉందని తీన్మార్ మల్లన్న అన్నారు. "వంద రూపాయల టికెట్‌ను వేలల్లో అమ్ముకునే సినిమా వాళ్లు ఏమైనా సంసారులా?" అని ప్రశ్నించారు. సినిమా ప్రముఖులతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించడంపై మండిపడ్డారు. రవి భార్య సమాచారం ఇవ్వకుంటే పోలీసులు అతడిని పట్టుకునేవారే కాదని, సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

సజ్జనార్ చేసేవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్లేనని, వరంగల్‌లో చేసింది కూడా అదేనని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. "నీకు దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్‌లు, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలను ఆపి చూపించు" అంటూ సవాల్ విసిరారు. గతంలో సీవీ ఆనంద్ కూడా ఇలాంటి సైబర్ మోసాలు ఆగవని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో ఇండస్ట్రీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. అయితే అధిక టికెట్ ధరల కారణంగా థియేటర్లకు వెళ్లలేని సామాన్యులు మాత్రం రవికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు పోలీసు శాఖను అగౌరవపరిచారంటూ మండిపడుతున్నారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Teenmaar Mallanna
Ibomma Ravi
Sajjanar
Cyber Crimes
Telangana Police
Fake Encounters
Cyber Fraud
Movie Tickets
Piracy Website
CV Anand

More Telugu News