రెండేళ్లుగా పేలుళ్లకు సన్నాహాలు.. విచారణలో నిజాలు కక్కిన డాక్టర్

  • ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి భారీ కుట్ర
  • దేశవ్యాప్తంగా దాడులకు జైషే అనుబంధ ముఠా ప్లాన్
  • సొంతంగా రూ. 26 లక్షలు సమకూర్చుకున్న ఉగ్రవాదులు
  • కుట్రలో కీలకపాత్ర పోషించిన డాక్టర్లు, ఇతర విద్యావంతులు
  • నిందితుడి వాంగ్మూలంతో బయటపడ్డ కీలక నిజాలు
ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ విద్యావంతుల ముఠా.. దేశంలోని పలు నగరాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని ఓ ఉగ్రవాద నిందితుడు విచారణలో అంగీకరించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.

ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్ సహచరుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్.. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సన్నాహాలు చేస్తున్నట్లు దర్యాప్తు అధికారుల ముందు వెల్లడించాడు. ఈ సమయంలో బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు, రిమోట్లు, ఇతర సామగ్రిని సేకరించినట్లు తెలిపాడు. హరియాణాలోని గురుగ్రామ్, నుహ్ ప్రాంతాల నుంచి రూ. 3 లక్షలతో 26 క్వింటాళ్ల ఎన్పీకే ఎరువును కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. యూరియా, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించే బాధ్యతను షకీల్‌కు అప్పగించగా, వాటిని బాంబులుగా మార్చే పనిని ఉమర్ మహమ్మద్ చూసుకున్నట్లు సమాచారం.

ఈ ఉగ్రకుట్రకు నిందితులే సొంతంగా నిధులు సమకూర్చుకోవడం గమనార్హం. ఈ ముఠా సభ్యులు మొత్తం రూ. 26 లక్షల నగదును పోగుచేశారు. ఉమర్ మహమ్మద్ రూ. 2 లక్షలు ఇవ్వగా, డాక్టర్ షకీల్ రూ. 5 లక్షలు, డాక్టర్ ఆదిల్ రాథర్ రూ. 8 లక్షలు, డాక్టర్ ముజఫర్ రాథర్ రూ. 6 లక్షలు, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయీద్ రూ. 5 లక్షలు సమకూర్చారు. పేలుడు ఘటనలో ఉమర్ మహమ్మద్ మరణించగా, మిగిలిన నిందితులను దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.


More Telugu News