Namansh Sayal: దుబాయ్ ఎయిర్ షోలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్ నమన్ష్ వివరాలు!

Wing Commander Namansh Sayal Lost His Life in Dubai Airshow Accident
  • దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదం
  • భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ నమ‌న్ష్ సయాల్ మృతి
  • ప్రదర్శన సమయంలో విన్యాసం విఫలమై కూలిన విమానం
దుబాయ్ ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం ప్రదర్శన సమయంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో వింగ్ కమాండర్ నమ‌న్ష్ సయాల్ (34) ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిన్న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో జరిగింది.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన ఈ తేలికపాటి యుద్ధ విమానం (LCA) వైమానిక విన్యాసాలు చేస్తుండగా అదుపు తప్పింది. తక్కువ ఎత్తులో చేసిన ఓ క్లిష్టమైన విన్యాసం నుంచి విమానాన్ని పైలట్ తిరిగి నియంత్రణలోకి తేలేకపోయారని వీడియోలను బట్టి తెలుస్తోంది. విమానం నేలను ఢీకొట్టడానికి ముందు పైలట్ బయటకు దూకే ప్రయత్నం చేయలేదని సమాచారం.

మరణించిన వింగ్ కమాండర్ న‌మ‌న్ష్ సయాల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందినవారు. ఆయన తండ్రి భారత సైన్యంలో పనిచేసి, విద్యాశాఖలో ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. నమ‌న్ష్‌కు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా భారత వైమానిక దళంలో అధికారిణిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒక శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆమె కోల్ కతాలో ఉన్నారు.

మరోవైపు, న‌మ‌న్ష్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక ధైర్యవంతుడైన, కర్తవ్య నిరతి గల పైలట్‌ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. 
Namansh Sayal
Dubai Airshow
Tejas Aircraft
Indian Air Force
IAF Pilot
Wing Commander
HAL Tejas
Sukhu
Air accident

More Telugu News