తమిళంలో హిట్ కొట్టిన మూడు సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి దిగిపోయాయి. ముందుగా 'డ్యూడ్' సినిమా ఓటీటీ సెంటర్ లో అడుగుపెట్టగా, ఇప్పుడు 'బైసన్' .. 'డీజిల్' సినిమాలు కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హరీశ్ కల్యాణ్ హీరోగా నటించిన 'డీజిల్' అక్టోబర్ 17న థియేటర్లకు వచ్చింది. షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: ఈ కథ చెన్నై సముద్రతీరంలో మొదలవుతుంది. 1979లో ప్రభుత్వం సముద్రతీరం మీదుగా 17 కిలోమీటర్ల మేర ఒక పైప్ లైన్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ పైప్ లైన్ లో నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పైప్ లైన్ జాలరుల గ్రామాలకు .. సముద్ర తీరానికి మధ్య అడ్డుగా మారుతుంది. దాంతో జాలరులెవరూ సముద్రంలోకి చేపల వేటకి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. 

ఈ సమస్యకి సంబంధించిన పోరాటంలోనే 'ఢిల్లీబాబు' చనిపోతాడు. అతని కొడుకు వాసుదేవ (హరీశ్ కల్యాణ్)ను మనోహర్ (సాయికుమార్) చేరదీస్తాడు. జాలరులు బ్రతకాలంటే క్రూడ్ ఆయిల్ ను దొంగిలించడమే మార్గమని మనోహర్ భావిస్తాడు. ఈ విషయంలో ముంబైలోని 'పఠాన్' (సచిన్ ఖేడేకర్) తో ఒప్పందం చేసుకుంటాడు. క్రూడ్ ఆయిల్ ను పెట్రోల్ గా .. డీజిల్ గా వేరు చేసే సొంత ఫ్యాక్టరీ పఠాన్ కి ఉంటుంది. అందువలన తమ గ్రామంలో దొంగిలించిన క్రూడ్ ఆయిల్ ను ముందుగా ముంబైకి తరలిస్తుంటారు. వచ్చిన డబ్బుతో గూడెం ప్రజలను ఆదుకుంటూ ఉంటారు.  

ఈ విషయంలో వాసుదేవ కీలకమైన పాత్రను పోషిస్తూ ఉండటం వలన, అందరూ అతనిని 'డీజిల్' అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే అక్రమంగా జరిగే ఈ బిజినెస్, పఠాన్ దురాశ కారణంగా చిక్కుల్లో పడుతుంది. అతను ప్రవేశపెట్టిన బాలమురుగన్ (వివేక్ ప్రసన్న) డీసీపీ మాయవేల్ (వినయ్ రాయ్) మాదకరంగా మారతారు. అలాంటి పరిస్థితులలో తన గూడెం ప్రజలను కాపాడుకోవడం కోసం డిజీల్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది కథ.

విశ్లేషణ: 'కొంతమంది స్వార్థపరులు విలాసవంతమైన జీవితం కోసం యుద్ధాలు సృష్టిస్తారు. పేదవాళ్లు తమ ఆకలి తీర్చుకోవడం కోసం ఆ యుద్ధాల్లో పాల్గొంటారు' అనే అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. ఏ క్రూడ్ ఆయిల్ కారణంగా తమ ఉపాధిని కోల్పోయారో, ఆ క్రూడాయిల్ నే ఆదాయ వనరుగా మార్చుకున్న ఓ జాలరి గూడెం చుట్టూ తిరిగే కథ ఇది. 

దర్శకుడు ఎత్తుకున్న ఈ సమస్య తెరపై కొత్తగా కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ చుట్టూ ఎలాంటి మాఫియా ఉండొచ్చుననేది చూపించిన విధానం బాగుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలు .. అవినీతి అధికారులు .. అరాచక దళారులు పేదవారిని టార్గెట్ చేస్తే, అక్కడి నుంచి పుట్టే తిరుగుబాటు ఏ స్థాయిలో ఉంటుందనేది ఆవిష్కరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది.                

 క్రూడ్ ఆయిల్ మాఫియా అంచలంచెలుగా సాగే తీరు మార్కులు కొట్టేస్తుంది. అయితే గూడెం వదిలి వెళ్లిపోయిన 'డీజిల్' తిరిగొచ్చిన దగ్గర నుంచి, చర్చలు - ఆచరణ అనే విధంగా సంభాషణలతో ఎక్కువ సమయం గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడి నుంచే కథనంలో వేగం తగ్గినట్టు తెలిసిపోతుంది. మీడియా హడావిడి .. మాస్ జనాల రచ్చ కూడా మామూలుగానే అనిపిస్తుంది.

పనితీరు: 'డీజిల్' మాఫియాను ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది. పాత్రలను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది. హీరో .. విలన్ .. పోలీస్ ఆఫీసర్ పాత్రలు హైలైట్ గా నిలుస్తాయి. అయితే ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ ను పట్టుగా నడిపించినట్టయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదని అనిపిస్తుంది.

హరీశ్ కల్యాణ్ .. సచిన్ ఖేడేకర్ .. వినయ్ రాయ్ నటన ఆకట్టుకుంటుంది. ఈ పాత్రలే ఈ కథను ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకుని వెళతాయి. అతుల్య రవి నాయిక స్థానంలో అందంగా మెరిసింది కానీ, ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. ప్రభు - రిచర్డ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ధిబూ నినన్ థామస్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. శాన్ లోకేశ్ ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: 'డీజిల్' అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 'డీజిల్' మాఫియా చుట్టూ ఈ కథను అల్లుకున్న తీరు ఆసకిని రేకెత్తించేదే. పాత్రలను డిజైన్ చేసుకున్న విధానం కూడా బాగుంది. అయితే ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ ఆకట్టుకోలేకపోయిందని అనిపిస్తుంది.