బీహార్‌లో మరో యాత్రకు సిద్దమైన ప్రశాంత్ కిశోర్

  • నితీశ్ కొత్త మంత్రివర్గంలో అవినీతిపరులు, నేరగాళ్లు ఉన్నారన్న ప్రశాంత్ కిశోర్
  • మోదీ, అమిత్ షా, నితీశ్‌లకు రాష్ట్ర ప్రగతిపై ఆసక్తి లేదని వ్యాఖ్య
  • డబ్బులు బదిలీ చేసి మహిళల ఓట్లను కొనుగోలు చేశారని ఆరోపణ
  • జనవరి 15 నుంచి 'బీహార్ నవనిర్మాణ సంకల్ప యాత్ర' చేపడుతున్నట్లు వెల్లడి
బీహార్‌లో నూతనంగా ఏర్పాటైన నితీశ్ కుమార్ మంత్రివర్గంపై జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన ఆరోపణలు చేశారు. కొత్త కేబినెట్ మొత్తం అవినీతిపరులు, నేర చరిత్ర ఉన్నవారితో నిండిపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమంలో శుక్రవారం రోజంతా మౌనవ్రతం చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
 
బీహార్ మంత్రివర్గంలో స్థానం పొందిన వారిని చూస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నితీశ్‌   కుమార్‌లకు రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం ఆసక్తి లేదనే విషయం స్పష్టమవుతోందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అంతేకాకుండా, అధికార కూటమి ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున బదిలీ చేసి వారి ఓట్లను దక్కించుకున్నారని ధ్వజమెత్తారు.
 
ఈ సందర్భంగా తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు. జన్‌ సురాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో జనవరి 15 నుంచి 'బీహార్ నవనిర్మాణ సంకల్ప యాత్ర'ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ సందర్శిస్తారని ఆయన వివరించారు.


More Telugu News