మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ .. నేడు తెలంగాణలో 37 మంది లొంగుబాటు!

  • తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు
  • లొంగిపోనున్న వారిలో కీలక నేతలు ఆజాద్, అప్పాసి నారాయణ
  • మధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడించనున్న డీజీపీ
మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. పలువురు కీలక నేతలు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారు. సాయుధ పోరాట మార్గాన్ని వీడి, ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.

లొంగిపోతున్న వారిలో ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రా వంటి కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, వీరిలో కేంద్ర, రాష్ట్ర కమిటీలకు చెందిన సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అడవులకే పరిమితమైన ముఖ్య నేతలు లొంగిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.

ఈ లొంగుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా వెల్లడించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి, లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెడతారు. వారి లొంగుబాటుకు గల కారణాలు, ప్రభుత్వ పునరావాస పథకం వంటి వివరాలను ఈ సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. 


More Telugu News