బంగ్లాదేశ్‌ లో నిన్నటి భూకంపంలో 10 మంది మృతి

  • బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం
  • ప్రమాదంలో 10 మంది మృతి.. 200 మందికి పైగా గాయాలు
  • ప్రాణభయంతో భవనాలపై నుంచి దూకిన యూనివర్సిటీ విద్యార్థులు
  • గార్మెంట్ ఫ్యాక్టరీలో తొక్కిసలాట.. 150 మంది కార్మికులకు గాయాలు
  • పలు నగరాల్లో భవనాలకు పగుళ్లు
బంగ్లాదేశ్‌లో నిన్న భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ భూప్రకంపనల కారణంగా కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైనట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం మృతుల్లో నలుగురు రాజధాని ఢాకాలో, ఐదుగురు నర్సింగ్దిలో, ఒకరు నారాయణగంజ్‌లో మరణించారు. ఢాకాలోని అర్మానిటోలా ప్రాంతంలో ఒక భవనం పైకప్పు రెయిలింగ్ కూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింగ్ది జిల్లాలోని మధాబ్ది ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ భూకంపం కారణంగా పలుచోట్ల తీవ్ర విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. గాజీపూర్‌లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో భూమి కంపించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. అదేవిధంగా ఢాకా యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు భయంతో భవనాలపై నుంచి కిందకు దూకడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.

ఢాకా సహా పలు నగరాల్లోని అనేక భవనాలకు స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి. భూకంపం తర్వాత తమ ఇళ్లలోని గోడలకు పగుళ్లు ఏర్పడిన ఫొటోలు, వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.




More Telugu News