అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన.. పనులపై కీలక ఆదేశాలు

  • సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
  • పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు కీలక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ముఖ్యంగా రాజధానికి గుండెకాయలాంటి సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, బకింగ్‌హామ్ కెనాల్స్‌పై నిర్మిస్తున్న వంతెనలను తనిఖీ చేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాజధానిలో రహదారులను వేగంగా అభివృద్ధి చేసి కనెక్టివిటీని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, ఆ దిశగా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.


More Telugu News