‘కమ్యూనిస్ట్’ అన్న నోటితోనే కంగ్రాట్స్.. న్యూయార్క్ మేయర్‌ను పొగిడిన ట్రంప్

  • వైట్‌హౌస్‌లో భేటీ అయిన ట్రంప్, జోహ్రాన్ మందానీ
  • గతంలోని విభేదాలు పక్కనపెట్టి సానుకూలంగా సాగిన చర్చలు
  • న్యూయార్క్ నగరం కోసం కలిసి పనిచేస్తామని ఇరువురి ప్రకటన
  • మందానీ ఎన్నికల విజయాన్ని అభినందించిన అధ్యక్షుడు ట్రంప్
  • ఈ భేటీ ఫలప్రదంగా జరిగిందని తెలిపిన మేయర్ జోహ్రాన్ మందానీ
అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిత్యం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ నగర కాబోయే మేయర్ జోహ్రాన్ మందానీ శుక్రవారం వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బద్ధ శత్రువుల్లా తలపడిన వీరిద్దరి మధ్య సమావేశం అనూహ్యంగా స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. న్యూయార్క్ నగరం కోసం తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ సోషలిస్ట్ అయిన జోహ్రాన్ మందానీ న్యూయార్క్ మేయర్‌గా సంచలన విజయం సాధించారు. నగరంలో పెరుగుతున్న జీవన వ్యయం, ప్రజా భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు ఆయనే స్వయంగా ట్రంప్‌తో భేటీ కావాల‌ని నిర్ణ‌యించారు. ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. "మేము అనుకున్న దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాం. మా ఇద్దరికీ ఉన్న ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం.. మనం ప్రేమించే న్యూయార్క్ నగరం అభివృద్ధి చెందడం" అని అన్నారు. మందానీ ఎన్నికల విజయాన్ని కూడా ఆయన అభినందించారు.

గతంలో ట్రంప్.. మందానీని "రాడికల్ లెఫ్ట్ లూనాటిక్", "కమ్యూనిస్ట్" అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. మరోవైపు ట్రంప్ విధానాలను మందానీ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఈ భేటీ తర్వాత మందానీ మాట్లాడుతూ.. "న్యూయార్క్ నగరంపై ఉన్న ప్రేమ, అభిమానం ఆధారంగా ఈ సమావేశం ఫలప్రదంగా జరిగింది. నగరవాసులకు అందుబాటు ధరల్లో సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యం" అని వివరించారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, న్యూయార్క్ ప్రయోజనాల కోసం ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించడం ఆకట్టుకుంది.


More Telugu News