ఆ లుక్ నాకు స్ఫూర్తినిచ్చింది: బాలకృష్ణ

  • 'వీరసింహారెడ్డి'లో తన గెటప్ కాపీయేనన్న బాలకృష్ణ
  • 'మఫ్టీ'లోని శివ రాజ్‌కుమార్‌ లుక్‌ తనకు స్ఫూర్తినిచ్చిందని వెల్లడి
  • చిక్కబళ్లాపురలో ఘనంగా 'అఖండ 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరైన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్
  • డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో 'అఖండ 2' విడుదల
నందమూరి బాలకృష్ణ తన సినిమా గెటప్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో తన లుక్‌ను కన్నడ చిత్రం ‘మఫ్టీ’లోని శివ రాజ్‌కుమార్ గెటప్ నుంచి స్ఫూర్తి పొంది కాపీ చేశానని ఆయన బహిరంగంగా అంగీకరించారు. శివ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు.

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ‘అఖండ 2 తాండవం’ పేరుతో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ‘అఖండ 2’ ఒక పాన్ ఇండియా చిత్రం. లాక్‌డౌన్ తర్వాత విడుదలైన తొలి భారతీయ సినిమా ‘అఖండ’. ఇప్పుడు దానికి కొనసాగింపుగా సనాతన హైందవ ధర్మం ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించాం. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ మల్హోత్రా అద్భుతంగా నటించారు’’ అని అన్నారు. అనంతరం శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, బాలకృష్ణ తనకు సోదరుడిలాంటి వారని పేర్కొన్నారు. 


More Telugu News