అరేబియా సముద్రంలో అరుదైన ఆవిష్కరణ... ఆక్టోపస్‌లా ఉండే కొత్త స్క్విడ్ గుర్తింపు

  • అరేబియా సముద్రంలో కొత్త స్క్విడ్ జాతి గుర్తింపు
  • కేరళ తీరంలో సీఎంఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
  • ఆక్టోపస్‌లా 8 చేతులు ఉండటంతో 'ఆక్టోపస్ స్క్విడ్'గా పేరు
  • దివంగత శాస్త్రవేత్త డాక్టర్ సిలాస్ గౌరవార్థం నామకరణం
భారత సముద్ర జీవ వైవిధ్య పరిశోధనలో ఓ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. కొచ్చిలోని ఐసీఏఆర్ - సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CMFRI) శాస్త్రవేత్తలు అరేబియా సముద్ర గర్భంలో సరికొత్త స్క్విడ్ జాతిని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతగా ప్రాచుర్యం లేని 'టానింగియా' ప్రజాతిలో ఇది రెండవది కావడం విశేషం.

కేరళలోని కొల్లం తీరానికి సమీపంలో సుమారు 390 మీటర్ల లోతులో ఈ స్క్విడ్‌ను గుర్తించారు. దీనికి 'టానింగియా సిలాసీ' (ఇండియన్ ఆక్టోపస్ స్క్విడ్) అని నామకరణం చేశారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ జర్నల్ 'మెరైన్ బయోడైవర్సిటీ'లో ప్రచురించారు. సాధారణంగా స్క్విడ్‌లకు పొడవైన రెండు టెంటకిల్స్ ఉంటాయి. కానీ, ఈ జాతి స్క్విడ్‌కు ఆక్టోపస్‌లా ఎనిమిది చేతులు ఉండటంతో దీనిని 'ఆక్టోపస్ స్క్విడ్' అని పిలుస్తున్నారు. ఇది 45 సెంటీమీటర్ల పొడవు ఉంది.

సీఎంఎఫ్ఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ గీతా శశికూమార్, టెక్నికల్ ఆఫీసర్ సజికుమార్ కె.కె. నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది. "దశాబ్దానికి పైగా అరేబియా సముద్రంలో పరిశోధనలు చేస్తున్నా, ఇలాంటి ఆక్టోపస్ స్క్విడ్‌ను ఎప్పుడూ చూడలేదు" అని గీత తెలిపారు. డీఎన్ఏ బార్‌కోడింగ్ పరీక్షల్లో అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించే 'టానింగియా డానే' జాతికి, దీనికి మధ్య 11 శాతానికి పైగా జన్యుపరమైన తేడా ఉన్నట్లు తేలింది. దీంతో ఇది పూర్తిగా కొత్త జాతి అని శాస్త్రీయంగా నిర్ధారించారు.

ఈ ప్రజాతి స్క్విడ్‌లు భారీ పరిమాణంలో పెరిగే అవకాశం ఉందని, అట్లాంటిక్‌లో కనిపించే స్క్విడ్ 2.3 మీటర్ల పొడవు, 61 కిలోల బరువు వరకు పెరిగినట్లు రికార్డులు ఉన్నాయని సజికుమార్ వివరించారు. సీఎంఎఫ్ఆర్ఐ మాజీ డైరెక్టర్, ప్రముఖ సముద్ర జీవ శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఇ.జి. సిలాస్‌కు గౌరవ సూచకంగా ఈ కొత్త జాతికి ఆయన పేరు పెట్టారు. ఈ ఆవిష్కరణ భారత సముద్ర గర్భ పరిశోధనలకు మరింత విలువను జోడించింది.


More Telugu News