రోడ్డు ప్రమాదంలో వధువుకు గాయాలు.. కొచ్చి ప్రైవేటు ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో వివాహం

  • ఆసుపత్రి వేదికగా అవని, శరణ్ వివాహం
  • అలంకరణ కోసం వధువు కారులో వెళుతుండగా ప్రమాదం
  • వధువుకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స
  • ముహూర్తం సమయానికి వివాహం కావాలని కోరడంతో అంగీకరించిన వైద్యులు
కేరళలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఒక వివాహ వేడుకకు వేదికైంది. వైద్యులు, సిబ్బంది అతిథులుగా హాజరయ్యారు. ఈ ఆసక్తికర ఘటన కొచ్చిలోని వీవీఎస్ లేక్‌షోర్ ఆసుపత్రిలో జరిగింది. అలప్పుజలోని కొమ్మడికి చెందిన అవని, తుంబోలికి చెందిన వీఎం శరణ్ ఇక్కడ వివాహం చేసుకున్నారు. వాస్తవానికి, ఈ వివాహం శుక్రవారం మధ్యాహ్నం తుంబోలిలో జరగాల్సి ఉండగా, వధువు రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆసుపత్రి వేదికగా మారింది.

శుక్రవారం ఉదయం వధువును అలంకరణ కోసం కుమరకోమ్‌కు తీసుకువెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అవనికి గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను కొట్టాయంలోని మెడికల్ కాలేజీకి తరలించారు. వెన్నెముకకు గాయం కావడంతో, మెరుగైన చికిత్స కోసం ఆమెను మధ్యాహ్నం కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వరుడు శరణ్, అతని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు.

వారి వివాహ ముహూర్తం శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు నిర్ణయించబడింది. ముహూర్తం సమయానికి వివాహం జరగాలని ఇరు కుటుంబాల వారు వైద్యులను కోరారు. వైద్యులు అంగీకరించడంతో ఎమర్జెన్సీ గదిలోనే అవని మెడలో శరణ్ తాళి కట్టాడు. ఆసుపత్రిలో ఉండటం వలన కొద్దిమంది వైద్యులు, సిబ్బంది, ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది.


More Telugu News