యాషెస్ తొలిరోజే వికెట్ల జాతర... ఒకే రోజు 19 వికెట్లు డౌన్

  • పెర్త్ టెస్టులో బౌలర్ల హవా
  • తొలి రోజు ఆట రసవవత్తరం
  • ఇంగ్లండ్ 32.5 ఓవర్లలోనే 172 పరుగులకు ఆలౌట్ 
  • తొలి రోజు ఆట చివరికి ఆసీస్ స్కోరు 9 వికెట్లకు 123 పరుగులు  
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి రోజే పెను సంచలనాలకు వేదికైంది. పెర్త్ స్టేడియంలోని బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై ఇరు జట్ల ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఒకే రోజు ఏకంగా 19 వికెట్లు నేలకూలాయి. బౌలర్ల ఆధిపత్యంతో మ్యాచ్ నాటకీయంగా మలుపులు తిరుగుతూ అత్యంత రసవత్తరంగా మారింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి, ఇంగ్లండ్‌ కంటే ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది.

అంతకుముందు, శుక్రవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా పేస్ గుర్రం మిచెల్ స్టార్క్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ యాషెస్ బౌలింగ్‌తో హడలెత్తించాడు. కేవలం 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దీంతో ఇంగ్లీష్ జట్టు 32.5 ఓవర్లలోనే 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, హ్యారీ బ్రూక్ (52) ఎదురుదాడితో ఆకట్టుకోగా, ఓల్లీ పోప్ (46) అతనికి సహకరించాడు. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 51,531 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఆసీస్ గడ్డపై 1932 తర్వాత ఒక విదేశీ జట్టు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంత వేగంగా ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.

స్టార్క్ తన తొలి స్పెల్‌లోనే జాక్ క్రాలీ (0), బెన్ డకెట్ (21), జో రూట్ (0) వికెట్లను తీసి ఇంగ్లండ్‌ను 39/3తో కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో బ్రూక్, పోప్ కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, స్టార్క్‌కు అరంగేట్ర బౌలర్ బ్రెండన్ డాగెట్ (2/27) తోడవడంతో ఇంగ్లండ్ కేవలం 19 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది.

అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మొదటి రోజు ఆట చివరికి 39 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో మార్నస్ లబుషేన్‌తో కలిసి అరంగేట్ర ఆటగాడు జేక్ వెదరాల్డ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ ధాటికి ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. వెదరాల్డ్ (0), లబుషేన్ (9), స్టీవ్ స్మిత్ (17), ఖవాజా (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. కేవలం 6 ఓవర్లలో 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ నడ్డి విరిచాడు. ట్రావిస్ హెడ్ (21), కామెరాన్ గ్రీన్ (24), అలెక్స్ కారీ (26) లాంటి కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాథన్ లియాన్ (3), బ్రెండన్ డాగెట్ (0) క్రీజులో ఉన్నారు. 1909 తర్వాత ఒక యాషెస్ టెస్టులో తొలి రోజే ఇన్ని వికెట్లు పడటం ఇదే ప్రథమం కావడంతో, రెండో రోజు ఆటపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


More Telugu News