తేజస్ యుద్ధ విమానం క్రాష్... పైలట్ మృతి చెందినట్టు ప్రకటించిన ఐఏఎఫ్

  • దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం
  • ప్రదర్శన ఇస్తుండగా జరిగిన ప్రమాదంలో పైలట్ మృతి
  • ఘటనను అధికారికంగా ధ్రువీకరించిన భారత వాయుసేన
  • ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశం
  • తేజస్ విమానానికి ఇది రెండో ప్రమాదం
దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన ఇస్తుండగా భారత వాయుసేన (IAF)కు చెందిన తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయారని ఐఏఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, పైలట్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను నిగ్గు తేల్చేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు వెల్లడించింది.

ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఏరియల్ డిస్‌ప్లే ఇస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం. 2001లో తొలిసారి గాల్లోకి ఎగిరినప్పటి నుంచి సుమారు 23 ఏళ్ల చరిత్రలో మొదటి ప్రమాదం 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో జరిగింది. అయితే ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.

తేజస్ 4.5వ తరం, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది వైమానిక దాడులు, క్లోజ్ కంబాట్, భూమిపై దాడి వంటి పలు రకాల పాత్రలను సులభంగా నిర్వహించగలదు. ఈ దుర్ఘటనతో దుబాయ్ ఎయిర్ షోలో విషాదఛాయలు అలుముకున్నాయి.


More Telugu News