ఆధార్ కార్డు చూపించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిన నారా భువనేశ్వరి... ఫొటోలు ఇవిగో!

  • కుప్పం పర్యటనలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి
  • ఆధార్ కార్డు చూపించి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత టికెట్ పొందిన వైనం
  • తుమ్మిసి చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు
  • కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని వ్యాఖ్య
  • రూ. 23 వేల కోట్లతో కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటు చేశారని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సామాన్య మహిళగా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా శాంతిపురంలోని నివాసం నుంచి తుమ్మిసి గ్రామానికి వెళ్లేందుకు ఆమె ఆర్టీసీ బస్సులో ఎక్కారు. మిగతా మహిళల మాదిరిగానే తన ఆధార్ కార్డును కండక్టర్‌కు చూపించి ఉచిత టికెట్‌ను పొందారు. ఈ పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

బస్సు ప్రయాణ సమయంలో భువనేశ్వరి తన పక్కన ఉన్న మహిళా ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ప్రభుత్వ పథకం ఎలా ఉందని, ఉచిత ప్రయాణం ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేయగా, వారి అభిప్రాయాలను ఆమె సావధానంగా విన్నారు. 

తన పర్యటనలో భాగంగా, నారా భువనేశ్వరి తుమ్మిసి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన 'జలహారతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుప్పం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. తాగు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎంతో శ్రమించి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. కుప్పంలో నీటి కరవు అనే మాటే వినిపించకూడదన్నది ఆయన లక్ష్యమని, రాష్ట్రంలోని రైతులందరికీ సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

కేవలం నీటిపారుదలకే పరిమితం కాకుండా, కుప్పం పారిశ్రామిక ప్రగతికి కూడా చంద్రబాబు బాటలు వేశారని భువనేశ్వరి వివరించారు. ఈ ప్రాంతానికి సుమారు రూ. 23,000 కోట్ల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను తీసుకొచ్చారని, వీటిలో మూడు పరిశ్రమలు ప్రత్యేకంగా మహిళల అభివృద్ధి, ఉపాధి కోసమే కేటాయించారని పేర్కొన్నారు. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కుప్పం ప్రజల ఆశీస్సులు చంద్రబాబుకు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.


More Telugu News