సిట్ విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు.. అప్పన్న నా పీఏ కాదు!

  • వైవీ సుబ్బారెడ్డి నివాసంలో 12 గంటల పాటు సిట్ విచారణ
  • కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • నెయ్యిలో అవినీతి ఆరోపణలను ఖండించిన సుబ్బారెడ్డి
టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుమల శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల కేసులో భాగంగా, ఆయన నివాసంలో దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు.

విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కల్తీ నెయ్యి విషయంలో నిజానిజాలు తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీం కోర్టును ఆశ్రయించానని గుర్తుచేశారు.

"నాపై అవినీతి ప్రచారం చేయడం దారుణం. కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉండగా, నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తాను?" అని ఆయన ప్రశ్నించారు. 2024 జూన్‌లో సరఫరా అయిన నాలుగు నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు ఉందా? లేక ఇతర నూనెలు కలిపారా? అన్నది తేల్చాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. భక్తుల విశ్వాసంతో తానెప్పుడూ ఆడుకోలేదని, బాధ్యతాయుతంగా పనిచేశానని స్పష్టం చేశారు.

ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి 2018 నుంచే తన వద్ద పీఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాలోకి లావాదేవీలు జరిగి ఉంటే, అతనితో పాటు సహకరించిన అధికారులపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే, 2014 నుంచి జరిగిన నెయ్యి సరఫరాలన్నింటిపైనా విచారణ జరపాలని సిట్‌ను కోరినట్లు వెల్లడించారు.


More Telugu News