రైల్‌లో కెటిల్‌తో మ్యాగీ వండిన మహిళ... భద్రతపై తీవ్ర ఆందోళనలు.. వీడియో ఇదిగో!

  • రైలు ఏసీ కోచ్‌లో కెటిల్‌తో మ్యాగీ వండిన మహిళ
  • ఇది తీవ్రమైన భద్రతా ఉల్లంఘన అని నెటిజన్ల ఆందోళన
  • ప్రయాణికులకు కనీస పౌర స్పృహ లేదంటూ విమర్శల వెల్లువ
రైలు ప్రయాణంలో ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తినడం లేదా స్టేషన్లలో దొరికే వేడివేడి పదార్థాలను తీసుకోవడం సాధారణమే. కానీ, ఓ మహిళ ఏకంగా రైలు ఏసీ కోచ్‌లోనే వంట చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ రైలు ఏసీ కంపార్ట్‌మెంట్‌లోని చార్జింగ్ సాకెట్‌లో ఎలక్ట్రిక్ కెటిల్ పెట్టి మ్యాగీ వండుకుంది. అంతేకాకుండా, ఆమె ఎంతో సంతోషంగా కెమెరాకు పోజులివ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, రైలులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌పై అదనపు భారం పడి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ వీడియోపై స్పందిస్తూ "ఇది ప్రయాణికులందరి ప్రాణాలకు ముప్పు తేవొచ్చు. ఇలాంటి వారి వల్లే మంచి సౌకర్యాలు అందరికీ దూరమవుతున్నాయి. చాలా మందికి కనీస పౌర స్పృహ లేదు" అని ఓ యూజర్ మండిపడ్డాడు. అయితే, "రైళ్లలో డీసీ విద్యుత్ సరఫరా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు ఛార్జ్ చేసినప్పుడు లేని ప్రమాదం దీనితో ఎలా వస్తుంది?" అని మరో యూజర్ ప్రశ్నించాడు.

ఈ ఘటనతో ప్రయాణికుల బాధ్యతారాహిత్యంపై మరోసారి చర్చ మొదలైంది. టికెట్ కొన్నంత మాత్రాన రైలులో ఏమైనా చేయవచ్చనే భావన కొందరిలో ఉందని, కెటిల్ వంటి వస్తువులను రైళ్లలోకి ఎలా అనుమతిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.  


More Telugu News