టీమ్‌మేట్స్‌తో కలిసి స్మృతి డ్యాన్స్.. ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ సర్‍ప్రైజ్!

  • సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోనున్న స్మృతి మంధాన
  • ఈ నెల‌ 23న వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం
  • సహచర క్రికెటర్లతో కలిసి డ్యాన్స్ చేసి ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన స్మృతి
  • 2019 నుంచి ప్రేమలో ఉన్న జంట
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యురాలు స్మృతి మంధాన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. తన చిరకాల ప్రియుడు, సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ అయిన పలాష్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనుంది. వీరి పెళ్లి ఈ నెల 23న జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రపంచకప్ గెలిచిన తర్వాత ట్రోఫీ పక్కన స్మృతి, పలాష్ నవ్వుతూ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది స్మృతికి "బెస్ట్ ప్రీ-వెడ్డింగ్ గిఫ్ట్" అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు.

2019లో వీరి ప్రేమకథ మొదలవ్వగా 2024 వరకు గోప్యంగానే ఉంచారు. ఇప్పుడు వీరి బంధం పెళ్లిపీటల వరకు చేరింది. పెళ్లికి ముందు స్మృతి తన సహచర క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌లతో కలిసి ఓ సరదా వీడియోను విడుదల చేసింది. ఇందులో వారంతా ‘లగే రహో మున్నాభాయ్’ సినిమాలోని ‘సమ్‌ఝో హో హీ గయా’ పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. వీడియో చివర్లో స్మృతి తన ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ అభిమానులను సర్‍ప్రైజ్ చేసింది.

ఎవరీ పలాష్ ముచ్చల్?
30 ఏళ్ల పలాష్ ముచ్చల్ వృత్తిరీత్యా సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్. అతని సోదరి పలక్ ముచ్చల్ బాలీవుడ్‌లో ప్రముఖ గాయని. అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె నటించిన ‘ఖేలే హమ్ జీ జాన్ సే’ చిత్రంలో పలాష్ కూడా నటించారు. ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్, రుబీనా దిలైక్‌లతో ‘అర్ధ్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు 29 ఏళ్ల స్మృతి మంధాన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రీడాకారిణి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆమెను రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది.


More Telugu News