ఆధార్ వినియోగంపై కీలక నిర్ణయం.. రానున్న కొత్త నిబంధనలు ఇవే!

  • ఆధార్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం కొత్త యాప్
  • ఆధార్ వివరాల దుర్వినియోగానికి అడ్డుకట్ట
  • క్యూఆర్ కోడ్, ఫేస్ స్కాన్‌తో గుర్తింపు ప్రక్రియ
  • హోటళ్లు, ఆఫీసులు, సినిమా హాళ్లలోనూ తప్పనిసరి అయ్యే అవకాశం
ఆధార్ కార్డు వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, అపార్ట్‌మెంట్లు వంటి ప్రదేశాల్లోకి ప్రవేశించాలంటే ఆధార్ తప్పనిసరి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి భారత విశిష్ఠ‌ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ కోసం ఒక కొత్త యాప్‌ను తీసుకురానుంది. ఆధార్ వివరాల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకీ కొత్త విధానం?
ప్రస్తుతం హోటళ్లు వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు గుర్తింపు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పిస్తున్నాం. దీనివల్ల కార్డుపై ఉన్న చిరునామా, ఫోన్ నంబర్ వంటి సున్నితమైన సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా యూఐడీఏఐ కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. దీని ప్రకారం ఆధార్ కార్డుపై పూర్తి వివరాలు లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా మార్పులు చేయనున్నారు.

ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త ఆఫ్‌లైన్ ధ్రువీకరణ వ్యవస్థ పూర్తిగా క్యూఆర్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. ‘ప్రూఫ్ ఆఫ్ ప్రెజెన్స్’ అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తారు. ఈ విధానంలో యూఐడీఏఐ సర్వర్లతో సంబంధం లేకుండానే యాప్ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని గుర్తిస్తారు. ఇది ప్రస్తుతం బ్యాంకులు వినియోగిస్తున్న ఫేస్ అథెంటికేషన్‌కు భిన్నమైంది.

ఈ విధానం అమల్లోకి వస్తే హోటళ్లు, లాడ్జ్‌లు, సినిమా హాళ్లు, ఆఫీసులు, ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల గుర్తింపు వంటి అనేక చోట్ల సురక్షితంగా వెరిఫికేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన ఏ సంస్థ అయినా ‘ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ (OVSE)’గా నమోదు చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇందుకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త యాప్ ప్రస్తుతం చివరి దశ టెస్టింగ్‌లో ఉందని, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలను విడుదల చేస్తామని యూఐడీఏఐ అధికారులు తెలిపారు.


More Telugu News