కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు

  • తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్న స్పీకర్
  • ఈరోజుతో 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై పూర్తి కానున్న విచారణ
  • ఈ నేపథ్యంలో ఇద్దరికి మరోసారి నోటీసులు జారీ చేసిన స్పీకర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా, సమాధానం ఇచ్చిన 8 మందిపై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.

ఈ రోజుతో 8 మంది ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లపై విచారణ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సభాపతి వారిద్దరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన ఎమ్మెల్యేలకు సంబంధించి న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సభాపతి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.


More Telugu News