ఐపీఎల్ వేలం రద్దు చేయండి.. ఆరు నెలల లీగ్ నిర్వహించండి: రాబిన్ ఊతప్ప

  • ఐపీఎల్‌లో వేలం విధానాన్ని రద్దు చేయాలని సూచించిన ఊతప్ప
  • దాని స్థానంలో డ్రాఫ్ట్ పద్ధతి తీసుకురావాలని వ్యాఖ్య
  • ఏడాది పొడవునా ట్రేడింగ్ విండోను అందుబాటులో ఉంచాలని ప్రతిపాదన
  • ఐపీఎల్‌ను ఆరు నెలల లీగ్‌గా మార్చాలని అభిప్రాయం
భారత మాజీ క్రికెటర్, రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ రాబిన్ ఊతప్ప ఈ మెగా లీగ్‌లో భారీ మార్పులు తీసుకురావాలని సూచించాడు. ఆటగాళ్ల వేలం విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో డ్రాఫ్ట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డాడు. అలాగే రెండున్నర నెలల టోర్నీని ఆరు నెలల లీగ్‌గా విస్తరించాలని, ఏడాది పొడవునా ప్లేయర్ల ట్రేడింగ్ విండోను తెరిచి ఉంచాలని తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

"ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. కానీ ఇప్పటికీ అది స్టార్టప్ దశను దాటడం లేదు. ఇకనైనా పరిణతితో వ్యవహరించాలి. దయచేసి వేలాన్ని రద్దు చేయండి. నేను ఆడుతున్న రోజుల నుంచే ఈ మాట చెబుతున్నాను" అని ఊతప్ప వ్యాఖ్యానించాడు. కేవలం టీవీ వినోదం అనే ఆలోచన నుంచి బయటకు రావాలని సూచించాడు. డ్రాఫ్ట్ విధానం కూడా టీవీలో ఆసక్తికరంగా ఉంటుందని, అభిమానుల్లో జట్టు పట్ల మరింత నమ్మకం పెరుగుతుందని వివరించాడు.

"ఐపీఎల్‌ను ఆరు నెలల లీగ్‌గా మార్చాలి. మధ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా నిర్వహించుకోవచ్చు. కాలానికి అనుగుణంగా లీగ్ మారాలి" అని ఊతప్ప అన్నాడు. డిసెంబర్ 16న అబుదాబిలో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో ఊతప్ప వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలే ట్రేడింగ్ విండోలో సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు, రవీంద్ర జడేజా, శామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.


More Telugu News