'ఐబొమ్మ' ఆగింది... 'ఐబొమ్మ వన్' వచ్చింది!

  • ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ తర్వాత మళ్లీ కలకలం
  • ‘ఐబొమ్మ వన్’ పేరుతో ప్రత్యక్షమైన మరో పైరసీ వెబ్‌సైట్
  • మూవీ రూల్జ్‌తో లింకులు 
తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మను పోలీసులు మూసివేయించిన కొన్ని రోజులకే, మరో కొత్త వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. ‘ఐబొమ్మ వన్’ పేరుతో దాదాపు అవే ఫీచర్లతో కొత్త సైట్ ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

కొత్తగా ప్రారంభమైన ‘ఐబొమ్మ వన్’ వెబ్‌సైట్ చూడటానికి అచ్చం పాత ఐబొమ్మ లాగే ఉంది. అయితే, పాత సైట్‌లో కేవలం తెలుగు సినిమాలు మాత్రమే ఉండగా, కొత్త సైట్‌లో ఇతర భాషా చిత్రాలు కూడా అందుబాటులో ఉంచారు. దీని వెనుక రవి అనుచరులు ఉన్నారా? లేక మరెవరైనా ఉన్నారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే, అది నేరుగా ‘మూవీ రూల్జ్’ అనే మరో పైరసీ సైట్‌కు రీడైరెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు.

ఐబొమ్మ ఎకోసిస్టమ్‌లో సుమారు 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, వాటి ద్వారానే ‘ఐబొమ్మ వన్’ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ ఎంవీ వంటి సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కాగా, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడు తరచూ విదేశాలకు వెళ్లేవాడని... ఎవరినీ నమ్మకపోవడంతో ఇంట్లో పనివాళ్లను కూడా పెట్టుకోలేదని పోలీసులు గుర్తించారు.


More Telugu News