హైదరాబాద్ 'పిస్తా హౌస్' యజమానింట్లో కోట్ల కొలదీ నగదు గుర్తింపు

  • హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఐటీ దాడులు
  • పన్నుల ఎగవేత ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు
  • పిస్తాహౌస్‌ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదు గుర్తింపు
  • కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న అధికారులు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిస్తాహౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పిస్తాహౌస్ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నిన్న ఉదయం నుంచి దాదాపు 35 బృందాలు నగరంలోని 30కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించాయి. హోటళ్లలో జరిపిన తనిఖీల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు, పెద్ద సంఖ్యలో హార్డ్‌డిస్క్‌లను అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా వచ్చే ఆర్డర్లకు, సంస్థ చూపిస్తున్న లెక్కలకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ మూడు హోటళ్లలోనూ ఆన్‌లైన్ ఆర్డర్లకు సంబంధించిన సరైన వివరాలు లేకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్కులలోని సమాచారం ఈ కేసు దర్యాప్తులో కీలకం కానుందని, పూర్తి విశ్లేషణ తర్వాత పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగిందనే దానిపై స్పష్టత వస్తుందని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి. 


More Telugu News