అమెరికాలో తల్లి, కొడుకు హత్య... హంత‌కుడిని ప‌ట్టించిన ల్యాప్‌టాప్

  • యూఎస్‌లో తల్లి, కొడుకు హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత పురోగతి
  • మృతురాలి భర్త సహోద్యోగే అసలు హంతకుడని నిర్ధారణ
  • నిందితుడి ల్యాప్‌టాప్‌పై ఉన్న డీఎన్‌ఏ ఆధారంగా కేసు ఛేదన
  • 2017లో న్యూజెర్సీలో శశికళ, ఆమె కుమారుడు హత్య
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఏపీకి చెందిన తల్లీకొడుకుల హత్య కేసులో కీలక పురోగతి లభించింది. మృతురాలి భర్తతో కలిసి పనిచేసిన సహోద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడు వాడిన ల్యాప్‌టాప్‌ ఆధారంగా ఈ కేసు మిస్టరీ వీడింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ (38), కుమారుడు అనీశ్‌ సాయి (6)తో కలిసి న్యూజెర్సీలో నివసించేవారు. కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేసే హనుమంతరావు... మేపుల్‌ షేడ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో ఉండేవారు. 2017 మార్చి 23న శశికళ, అనీశ్‌ దారుణ హత్యకు గురయ్యారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, తొలుత భర్త హనుమంతరావునే అనుమానించారు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విడిచిపెట్టారు. అదే సమయంలో హత్య జరిగిన ప్రదేశంలో హంతకుడికి సంబంధించిన రక్తపు మరకలను, డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. విచారణలో హనుమంతరావుకు, అతని సహోద్యోగి నజీర్‌ హమీద్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

హత్య జరిగిన ఆరు నెలల తర్వాత హమీద్‌ అమెరికాను విడిచిపెట్టి భారత్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ కాగ్నిజెంట్‌లో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. కేసు విచారణ కోసం డీఎన్‌ఏ నమూనా ఇవ్వాలని అమెరికా అధికారులు భారత్‌ ద్వారా హమీద్‌ను కోరగా, అతను నిరాకరించాడు. దీంతో 2024లో కోర్టు అనుమతితో హమీద్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్‌టాప్‌పై లభించిన డీఎన్‌ఏను, ఘటనా స్థలంలో సేకరించిన రక్త నమూనాలతో పోల్చి చూడగా రెండూ సరిపోలాయి. ఆ రక్తం హమీద్‌దేనని తేలడంతో, తాజాగా అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.


More Telugu News