హెచ్1-బీ వీసాలపై యూటర్న్.. ట్రంప్ వ్యాఖ్యలతో భారతీయ నిపుణులకు ఊరట

  • విదేశీ టెక్ నిపుణులను అమెరికాకు స్వాగతిస్తామన్న ట్రంప్
  • అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే ఈ నిర్ణయమని స్పష్టీకరణ
  • తన వైఖరిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత రావొచ్చని వ్యాఖ్య
  • ట్రంప్ వ్యాఖ్యలపై రిపబ్లికన్లలో భగ్గుమన్న అసమ్మతి
  • గ‌తేడాది 70 శాతానికి పైగా హెచ్1-బీ వీసాలు పొందిన  భారతీయులు
వలసల విషయంలో తన కఠిన వైఖరికి భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని టెక్నాలజీ పరిశ్రమల అభివృద్ధికి విదేశీ నిపుణుల అవసరం ఎంతో ఉందని, అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు వేలాది మందిని ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్ధమైన వలసలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని తెలిపారు.

వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన యూఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ.. "అరిజోనాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడితో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నిరుద్యోగులతో దాన్ని నడపలేరు. అందుకు నైపుణ్యం కలిగిన వేలాది మంది అవసరం. అలాంటి వారిని విదేశాల నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. నేను వారిని స్వాగతిస్తాను" అని అన్నారు. ఈ విదేశీ నిపుణులు మన అమెరికన్లకు కంప్యూటర్ చిప్స్ తయారీ వంటి సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తారని ఆయన వివరించారు.

ఈ నిర్ణయం వల్ల తన సొంత పార్టీలోని సంప్రదాయవాదులు, 'మాగా (MAGA)' మద్దతుదారుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. "నా స్నేహితుల నుంచి విమర్శలు రావొచ్చు. కానీ ఇది కూడా 'మాగా' కోసమే. విదేశీ నిపుణులు వచ్చి మన వాళ్లకు శిక్షణ ఇస్తారు" అని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి నేతలు హెచ్1-బీ వీసాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైట్‌హౌస్, వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకే లక్ష డాలర్ల దరఖాస్తు రుసుమును ప్రతిపాదించామని, ఇది అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతుందని తెలిపింది. 2024లో జారీ అయిన మొత్తం హెచ్1-బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందడం గమనార్హం. 


More Telugu News