జోహన్నెస్‌‍బర్గ్‌లో జీ20 సదస్సు.. దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న ప్రధాని మోదీ

  • నవంబర్ 22, 23 తేదీలలో 20వ జీ20 సదస్సు
  • సదస్సులో పాల్గొననున్న జీ20 దేశాధినేతలు
  • మూడు సెషన్లలో ప్రసంగించనన్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 21 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జోహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 20వ జీ20 దేశాల అధినేతలు సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ఇది గ్లోబల్ సౌత్‌లో వరుసగా జరుగుతున్న నాలుగవ జీ20 శిఖరాగ్ర సమావేశం. ఈ సదస్సులో, ప్రధానమంత్రి జీ20 ఎజెండాపై భారతదేశం యొక్క దృక్పథాలను తెలియజేస్తారు. సదస్సులోని మూడు సెషన్లలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు" అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని సమగ్ర, స్థిరమైన ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పులు, ఆహార వ్యవస్థలు, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు అంశాలపై మాట్లాడనున్నారు. జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జోహన్నెస్‌బర్గ్‌లో వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని వెల్లడించింది. అదే విధంగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా నేతల సమావేశంలోనూ పాల్గొననున్నట్లు తెలిపింది.

జీ20 సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి రైతులను చూస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు మయామిలో చేసిన ఒక ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ20 నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.


More Telugu News