బెంగళూరులో పట్టపగలే భారీ దోపిడీ... ఆర్బీఐ అధికారులమంటూ రూ.7.11 కోట్లు లూటీ!

  • బెంగళూరులో సినీ ఫక్కీలో దోపిడీ
  • ఏటీఎం సిబ్బందిని బెదిరించి రూ.7.11 కోట్ల దోపిడీ
  • నగరంలో హై అలర్ట్.. సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు
  • సీఎంఎస్ సిబ్బంది ప్రమేయంపై పోలీసుల అనుమానం
కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలలో నింపేందుకు తరలిస్తున్న రూ.7.11 కోట్ల నగదుతో ఉన్న వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. నిందితులు తప్పించుకోకుండా నగర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

సౌత్ ఎండ్ సర్కిల్ వద్ద సీఎంఎస్ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నోవా కారులో వచ్చిన 7-8 మంది దుండగులు, తాము ఆర్బీఐ అధికారులమంటూ సిబ్బందిని బెదిరించారు. వాహనంలోని గన్‌మన్లు, ఇతర సిబ్బందిని కిందకు దించి, డ్రైవర్‌ను మాత్రం వాహనంలోనే ఉంచి డెయిరీ సర్కిల్ వైపు తీసుకెళ్లారు.

డెయిరీ సర్కిల్ ఫ్లైఓవర్‌పై వాహనాన్ని ఆపి, అందులోని నగదును తమ ఇన్నోవా కారులోకి మార్చుకొని అక్కడి నుంచి పరారయ్యారు. దోపిడీకి ఉపయోగించిన ఇన్నోవా కారుకు నకిలీ నంబర్ ప్లేట్ (KA 03 NC 8052) ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నంబర్ వాస్తవానికి కల్యాణ్ నగర్‌కు చెందిన స్విఫ్ట్ కారుదని తేలింది.

ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన 45 నిమిషాల నుంచి గంట ఆలస్యంగా సిబ్బంది సమాచారం ఇవ్వడం, గన్‌మన్లు తమ ఆయుధాలను ఎందుకు ఉపయోగించలేదనే అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంఎస్ సిబ్బంది ప్రమేయం ఉండొచ్చనే కోణంలోనూ విచారిస్తున్నారు. డ్రైవర్, ఇద్దరు గన్‌మన్లు సహా నలుగురు సిబ్బందిని సిద్దాపుర పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. "నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేస్తాం" అని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతోనే సీసీటీవీ కెమెరాలు లేని, రద్దీగా ఉండే డెయిరీ సర్కిల్ ఫ్లైఓవర్‌ను దోపిడీకి ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.


More Telugu News