ఢిల్లీ పేలుడు... బయటకు వెళితే అనుమానంగా చూస్తున్నారు: ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు

  • కొంతమంది చేసిన తప్పులకు కశ్మీరీలను బాధ్యులను చేయడం సరికాదన్న ఒమర్ అబ్దుల్లా
  • ఉగ్ర కుట్రలకు తమను ఎక్కడ బాధ్యులను చేస్తారేమో అనే భయం ఉందని వ్యాఖ్య
  • ఇతర రాష్ట్రాలకు వెళితే వాహనాన్ని ఎక్కడ తనిఖీ చేస్తారోనని ఆలోచిస్తున్నానని వ్యాఖ్య
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట సమీపంలో కారు పేలుడు తర్వాత కశ్మీరీలను అందరూ అనుమానంగా చూస్తున్నారని ఆయన అన్నారు. కొంతమంది చేసిన తప్పులకు కశ్మీరీలందరినీ బాధ్యులను చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉగ్ర కుట్రలకు తమను ఎక్కడ బాధ్యులను చేస్తారేమో అనే భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా కశ్మీరీలు భయపడుతున్నారని అన్నారు.

జమ్ము కశ్మీర్ నెంబర్ ఉన్న వాహనాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్నా తాను కూడా భయపడుతున్నానని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీలో జరిగిన పేలుడుకు కశ్మీర్‌లోని కొందరు బాధ్యులు కావడం వల్ల మొత్తం కశ్మీర్ ప్రజలు అందులో భాగమనే భావనను సృష్టిస్తున్నారని అన్నారు. తాను ఇతర రాష్ట్రాలకు వెళితే ఎవరు ఎక్కడ ఆపి వాహనాన్ని తనిఖీ చేస్తారోనని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని అన్నారు.

ప్రస్తుతం జమ్ము కశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాన్ని ఢిల్లీలో నడపడం కూడా నేరంగా పరిగణిస్తున్నారని అన్నారు. అందరూ మనల్ని అనుమానాస్పద దృష్టితో చూస్తున్నప్పుడు, మనకు సంబంధం లేని అంశంలో మనల్ని కించపరుస్తున్నప్పుడు బయటకు వెళ్లడం కష్టమనిపిస్తుందని అన్నారు. అందుకే ప్రస్తుతం కశ్మీర్ ప్రజలు తమ పిల్లలను బయటకు పంపడానికి ముందుకు రావడం లేదని అన్నారు.


More Telugu News