గుజరాత్‌లో 'చిల్లర' కోసం బ్యాంకుకు క్యూ కట్టిన జనాలు
- మెహనసాలోని బ్యాంకు వద్ద కనిపించిన పెద్దనోట్ల రద్దు నాటి క్యూ దృశ్యం
- కొత్తగా ముద్రించిన రూ.10 నోట్ల జారీకి శిబిరం ఏర్పాటు చేసిన బ్యాంకు
- రూ.14 లక్షల విలువైన తక్కువ విలువ కలిగిన కరెన్సీ జారీ చేసిన బ్యాంకు
వివిధ మీడియా కథనాల ప్రకారం, మెహసానా కోఆపరేటివ్ బ్యాంకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి కొత్తగా ముద్రించిన రూ. 10 నోట్లు, నాణేలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. ఉదయం నుంచి ప్రజలు వరుసలలో నిలబడ్డారు. స్థానిక వ్యాపారులు, ఇతర వర్గాల వారి డిమాండ్ మేరకు తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొరతను పరిష్కరించే లక్ష్యంతో బ్యాంకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా రూ. 14 లక్షల విలువైన రూ. 10 నోట్లు, కొంత మొత్తంలో రూ. 20 నోట్ల కట్టలు, అలాగే రూ. 3 లక్షల విలువైన రూ. 2, రూ. 5 నాణేలను బ్యాంకు పంపిణీ చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగిది. ప్రజలు తమ అవసరాల మేరకు చిల్లర తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్యాంకు మేనేజర్ ముఖేశ్ భాయ్ పటేల్ తెలిపారు.