అన్నదాత నిధులు విడుదల చేసిన చంద్రబాబు... రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అయిన నిధులు

  • అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ రెండో విడత నిధులు విడుదల
  • రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు రూ.3,200 కోట్లు కేటాయింపు
  • ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున జమ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా పెండ్లిమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.3,200 కోట్లు జమ అయ్యాయి.

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో పర్యటించిన సీఎం చంద్రబాబు, తొలుత ‘మన గ్రోమోర్‌’ ఎరువుల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ స్థానిక రైతులతో కాసేపు ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ నుంచి నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున జమ అయినట్లు అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో, ఈ పథకంలోని కేంద్ర ప్రభుత్వ వాటా అయిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూర్‌ నుంచి విడుదల చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం రైతులకు పెట్టుబడి ఖర్చులకు అండగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.


More Telugu News