ఈసీపై ఆరోపణలు.. రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖుల లేఖ

  • లేఖపై సంతకం చేసిన వారిలో రిటైర్డ్ న్యాయమూర్తులు, మాజీ అధికారులు, సైనికాధికారులు, రాయబారులు
  • సొంత రాజకీయాల కోసం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
  • అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న ప్రముఖులు
భారత ప్రజాస్వామ్యం, దాని మూల స్తంభాలపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి 272 మంది ప్రముఖులు లేఖ రాశారు. ఓట్ల చోరీ జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన విధానాలను విమర్శిస్తూ ఈ లేఖ వెలువడింది. ఈ లేఖపై 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 133 మంది మాజీ సైనికాధికారులు, 14 మంది మాజీ రాయబారులు సంతకాలు చేశారు.

ప్రజాస్వామ్యం, దాని పునాదులపై దాడి జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారని గుర్తు చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. అయితే, ఈ విషయంపై రాహుల్ గాంధీపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.

ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల కమిషన్‌పై పదేపదే దాడి చేస్తూ, ఓట్ల చోరీకి సంబంధించి తన వద్ద అణుబాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని చెబుతూ నమ్మశక్యం కాని, అభ్యంతరకర భాషను ఉపయోగిస్తున్నారని వారు విమర్శించారు. ఈసీలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎవరినీ వదిలిపెట్టబోమని బెదిరింపులకు పాల్పడటం సరికాదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)ను విమర్శించడాన్ని వారు ఖండించారు.

ఎస్ఐఆర్‌‍పై ఈసీ ఇప్పటికే వివరణ ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా దీనిపై మార్గదర్శకాలు జారీ చేసిందని వారు గుర్తు చేశారు. ఈ ప్రక్రియలో అనర్హులను తొలగించి, కొత్తగా అర్హత కలిగిన ఓటర్లను చేర్చడం మాత్రమే జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేయడం లేదని, వ్యతిరేకంగా వస్తే మాత్రం ఈసీని విలన్‌గా చిత్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు రాజ్యాంగ ప్రక్రియను గౌరవించాలని, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకుని, విధానపరమైన ప్రకటనలతో పోటీ పడాలని వారు ఆ లేఖలో సూచించారు.


More Telugu News