పేదలకు ప్రేమతో సాయం చేయాలన్న బాబా మాటలే నాకు స్ఫూర్తి: నారా లోకేశ్

  • సత్యసాయి మార్గాన్ని అందరూ ఆచరించాలని మంత్రి పిలుపు
  • సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని వ్యాఖ్య
  • సమాజం పట్ల బాధ్యతను పెంపొందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయని ప్రశంస
  • ప్రధాని మోదీకి ఏపీ ప్రజలు, సత్యసాయి భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
పేదలకు ప్రేమతో సహాయం అందించాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలలో మంత్రి మాట్లాడుతూ.. సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువలను పెంపొందించే అభ్యాస సంస్థలుగా ఇవి సేవలందిస్తున్నాయని చెప్పారు.

సురక్షిత తాగునీటి ప్రాజెక్టులను పట్టణాలు, గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు అనుసంధానించి ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తూ వాస్తవ ప్రగతిని సాధిస్తున్నాయని కొనియాడారు. నేటి యువత సాంకేతికత-కరుణ, ఆవిష్కరణ-సానుభూతి కలయికతో కూడిన లక్షణాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. నేర్చుకునే విద్య, ఆరోగ్యం, తాగునీరు, నైపుణ్యం, గ్రామీణాభివృద్ధిలో వాస్తవ సవాళ్లను పరిష్కరించేలా ఉండాలని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాలనలో వివిధ విభాగాలు, వ్యాపారం, సైన్స్, స్టార్టప్ లకు నేడు నైతిక మేథస్సు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి..
‘‘భగవాన్ చెప్పినట్లుగా పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు నేర్పడం నా ధ్యేయం. మనుషుల్లో ఆయన దేవుడిని చూశారు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు. సేవతో ప్రజలకు దేవుడయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాలి. కుల, మత, ప్రాంతీయ విభజనలు వద్దు. పేదలకు సాయం చేయాలి. సత్యం మాట్లాడండి. భగవాన్ శతజయంతి సందర్భంగా మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి ఇదే. భగవాన్ సత్యసాయి పేరుతో రూ.100 నాణేలు, పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ప్రజల తరపున, సత్యసాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


More Telugu News