జియో 5జీ యూజర్లకు బంపరాఫర్.. 18 నెలల పాటు జెమిని ప్రో ప్లాన్ ఉచితం!

  • గూగుల్ లేటెస్ట్ జెమిని 3 మోడల్‌తో అప్‌గ్రేడ్
  • రూ.35,100 విలువైన ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్న జియో
  • మై జియో యాప్‌లో యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు
రిలయన్స్ జియో తన 5జీ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. 'జియో జెమిని' ఆఫర్‌లో కీలక మార్పులు చేస్తూ, గూగుల్ లేటెస్ట్ ఏఐ మోడల్ 'జెమిని 3'తో కూడిన 'జియో జెమిని ప్రో ప్లాన్‌'ను ఉచితంగా అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం యువతకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను ఇప్పుడు అర్హులైన అన్‌లిమిటెడ్ 5జీ వినియోగదారులందరికీ వర్తింపజేసింది.

ఈ ఆఫర్ కింద, రూ.35,100 విలువైన జెమిని ప్రో ప్లాన్‌ను జియో 5జీ కస్టమర్లు 18 నెలల పాటు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పొందవచ్చు. ఈ కొత్త అప్‌గ్రేడ్ బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. అర్హులైన వినియోగదారులు తమ మై జియో యాప్‌లోకి వెళ్లి 'క్లెయిమ్ నౌ' బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా తక్షణమే ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రతి భారతీయుడికి అత్యాధునిక ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో తెలిపింది.

ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ జెమిని 3ని సెర్చ్, జెమిని యాప్, ఏఐ స్టూడియో వంటి వాటిలో వేగంగా అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. జెమిని 3కి ఫొటోలు, పీడీఎఫ్‌లు, చేతిరాత వంటి ఎలాంటి ఇన్‌పుట్ ఇచ్చినా, దాని ఆధారంగా వెబ్‌సైట్ లేదా ఇంటరాక్టివ్ పాఠం వంటివి సృష్టించగలదని ఆయన వివరించారు. ఈ అధునాతన ఏఐ సేవలను ఇప్పుడు జియో తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది.


More Telugu News