చర్చలకు సిద్ధమన్నా చంపేస్తారా?: మారేడుమిల్లి ఘటనపై సీపీఐ రామకృష్ణ

  • మారేడుమిల్లిలో హిడ్మా ఎన్‌కౌంటర్‌పై సీపీఐ ఆగ్రహం
  • ఇది ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని రామకృష్ణ విమర్శ
  • ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా సహా ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేయడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వారిపై దమనకాండ కొనసాగించడం దారుణమని ఆయన బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ, ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా హతమార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా హింసాత్మక విధానాలను విడనాడాలని రామకృష్ణ హితవు పలికారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరిపి, సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని సీపీఐ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


More Telugu News