ఐబొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలి... టాలీవుడ్ సీనియర్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

  • కడుపు మంట, ఆవేదనతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని వెల్లడి
  • రవిని పట్టుకున్న పోలీసులను త్వరలో సత్కరిస్తామన్న ఫిల్మ్ ఛాంబర్
  • దేశంలో యాంటీ పైరసీ సెల్ నడుపుతున్నది తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ మాత్రమేనని వెల్లడి
ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధి సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన అన్నారు. రవి అరెస్ట్ నేపథ్యంలో మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే పైరసీ చేసేవారిలో భయం పుడుతుందని అభిప్రాయపడ్డారు.
 
తాను ఎంతో కడుపు మంటతో, ఆవేదనతో ఈ మాటలు అంటున్నానని సి. కల్యాణ్ పేర్కొన్నారు. ఎంతో శ్రమించి రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఫిల్మ్ ఛాంబర్ తరఫున త్వరలోనే ఘనంగా సత్కరిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్న యాంటీ వీడియో పైరసీ సెల్ గురించి ఆయన గుర్తు చేసుకున్నారు.
 
"నేను ఛాంబర్ సెక్రటరీగా ఉన్నప్పుడు యాంటీ పైరసీ సెల్‌ను ఏర్పాటు చేశాం. మన పరిశ్రమను మనమే కాపాడుకోవాలన్న బాధ్యతతో దాన్ని ప్రారంభించాం. మా కృషిని స్కాట్లాండ్ పోలీసులు సైతం గుర్తించి, కొంతకాలం నిధులు కూడా పంపించారు. గతంలో ఆస్ట్రేలియా కేంద్రంగా పైరసీ చేస్తున్న ఓ వ్యక్తిని కూడా పట్టించాం. దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్‌ను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే. మధ్యలో మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా దానిని కొనసాగిస్తూనే ఉన్నాం" అని సి. కల్యాణ్ వివరించారు.


More Telugu News