Tej Pratap Yadav: కుటుంబంలో చిచ్చు... ప్రధాని మోదీ, అమిత్ షాకు లాలు పెద్ద కుమారుడి విజ్ఞప్తి

Tej Pratap Yadav Appeals to Modi and Shah Over Family Feud
  • తేజస్వి సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారన్న తేజ్ ప్రతాప్
  • దర్యాప్తునకు ఆదేశించాలని మోదీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తేజ్ ప్రతాప్ 
  • తేజస్వి సహాయకులు దురాశ, అహంకారంతో విర్రవీగుతున్నారని ఆగ్రహం
తేజస్వి యాదవ్ సహాయకులు తమ కుటుంబాన్ని, పార్టీని ముక్కలు చేస్తున్నారని, అలాంటి ద్రోహుల వల్ల తమ తల్లిదండ్రులు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసిందని లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. లాలు కుటుంబంలో చీలికల నేపథ్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్ స్పందించారు.

తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, ముఖస్తుతి చేసేవారి కుట్రపూరిత రాజకీయాల వల్ల, ఆర్జేడీని బలమైన పార్టీగా మార్చడానికి ఎన్నో ఏళ్లు కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆరోపించారు. దురాశ, అహంకారంతో విర్రవీగుతున్న తేజస్వి సహాయకులు తన తల్లిదండ్రులు లాలు ప్రసాద్, రబ్రీదేవిలను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు.

తన తండ్రి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ పరిస్థితుల్లో వారు ఒత్తిడిని తట్టుకోలేరని ఆయన అన్నారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీహార్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.

తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, కుటుంబంతోనూ సంబంధాలను తెంచుకుంటున్నానని లాలు కుమార్తె రోహిణీ ఆచార్య అన్నారు. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, తేజస్వి మిత్రుడు రమీజ్‌ఖాన్ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అనంతరం లాలూ మరో ముగ్గురు కుమార్తెలు కూడా పాట్నాలోని ఆయన ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తన కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తేజస్వి సహాయకులే కారణమని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపిస్తున్నారు.
Tej Pratap Yadav
Lalu Prasad Yadav
Tejaswi Yadav
Rabri Devi
Bihar Politics
Rashtriya Janata Dal

More Telugu News