1993లో వచ్చిన 'జురాసిక్ పార్క్' ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఆ తరువాత నుంచి సీక్వెల్స్ రావడం మొదలైంది. 2022లో 'జురాసిక్ వరల్డ్ : డొమినియన్' ప్రేక్షకులను పలకరించగా, ఇటీవలే 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' థియేటర్లలో దిగిపోయింది. ఈ ఏడాది జూన్ లో విడుదలైన ఈ సినిమా, 7,500 కోట్లను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా, రెంటల్ విధానంలో కొన్ని రోజుల క్రితమే ఓటీటీకి వచ్చింది. అలాంటిదేమీ లేకుండా ఈ నెల 14వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధమైన జబ్బులతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. గుండె జబ్బులను నివారించడంలో డైనోసార్ ల రక్తంతో చేసే ఔషధం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. డైనోసార్ లలో నేలపై నడిచేవి .. సముద్ర జలాలలో నివసించేవి .. గాలిలో ఎగిరేవి ఉంటాయి. ఈ మూడు రకాల డైనోసార్ లు ప్రాణాలతో ఉండగానే వాటి నుంచి రక్తనమూలను సేకరించవలసి ఉంటుంది. 

అయితే ఈక్వెడార్ ప్రాంతంలోని వాతావరణం అనుకూలంగా ఉండటం వలన, అక్కడ ఈ డైనోసార్ లు ఎక్కవగా నివసిస్తూ ఉంటాయి. గతంలో అక్కడ ఈ డైనోసార్ లపై ప్రయోగాలు జరిగాయి. అయితే కొన్ని కారణాల వలన ఆ ల్యాబ్ ఇప్పుడు మూతబడిపోయింది. అలాంటి ప్రాంతానికి వెళ్లడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎవరికి ఎలాంటి అనుమతి లేదు. అయితే డబ్బు కోసం 'మార్టిన్ క్రెబ్స్' (రూపర్ట్ ఫ్రెండ్) రంగంలోకి దిగుతాడు.  

ఈ విషయంలో ఆయన డాక్టర్ హెన్రీ లూమిస్ (జోనాథన్ బైలి) జోరా బెన్నెట్ (స్కార్లెట్ జాన్సన్) సాయాన్ని కోరతాడు. బోట్ ఓనర్ డంకెన్ (మహెర్షలా అలీ) ను ఒప్పిస్తాడు. అందరూ కలిసి సముద్ర ప్రయాణం మొదలుపెడతారు. మార్గమధ్యంలో  ఆపదలో చిక్కుకున్న రూబెన్ కుటుంబ సభ్యులైన నలుగురిని ఈ బృందం కాపాడుతుంది. అందరూ కలిసి డైనోసార్ లు నివసించే ప్రదేశంలోకి అడుగుపెడతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి ఆపదాలు ..  అనుభవాలు ఎదురవుతాయి? తాము అనుకున్నట్టుగా వాళ్లు శాంపిల్స్ సేకరిస్తారా? అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారా? అనేది మిగతా కథ.

విశ్లేషణ: 'జురాసిక్ పార్క్' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 'డైనోసార్'ల గురించిన పరిశీలన .. అవగాహన అనేది సామాన్యులలో సైతం పెంచుతూ వెళ్లిన సినిమా అది. అందువలన ఆ సినిమాకి సీక్వెల్ గా ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ వాటి పట్ల ఆసక్తిని కనబరుస్తూనే ఉన్నారు. అయితే వాటిలో కొన్ని ఆశించినస్థాయిలో ప్రభావితం చేయలేకపోయినవి కూడా ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో వచ్చిన 'జురాసిక్ వరల్డ్: రీబర్త్' .. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మూడు ముఖ్యమైన అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రభుత్వ అనుమతిలేని ప్రదేశానికి బృందం బయల్దేరడం .. ప్రమాదకరమైన అడవులలో ప్రయాణించడానికి సిద్ధపడటం .. బ్రతికున్న డైనోసార్ ల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించడం. ఈ విషయాలలో వాళ్లకి ఎదురయ్యే అవరోధాలే ఈ సినిమా అని చెప్పచ్చు. 

సముద్రంలో నివసించే డైనోసార్ లు బోట్ ను వెంటాడటం .. అడవులలోని డైనోసార్ లు తరమడం .. గాలిలో ఎగిరే డైనోసార్ లు దాడి చేయడం .. శాంపిల్స్ సేకరించే విధానం వంటి సన్నివేశాలు ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. అయితే ఆరంభంలో సంభాషణలతో సాగదీసినట్టుగా .. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో లేనట్టుగా అనిపిస్తుంది.  

పనితీరు: ఈ కథలో దర్శకుడు డైనోసార్ లలోని మూడు రకాల జాతులపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. అందుకు తగినట్టుగా ఆయా సన్నివేశాలను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. నటీనటుల నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. విజువల్స్ .. లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో నిలుస్తాయి. 

ముగింపు: కథ .. విజువల్స్ .. లొకేషన్స్ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అక్కడక్కడా కాస్త సాగదీసినట్టుగా అనిపించినప్పటికీ, ఆ తరువాత చోటుచేసుకునే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మళ్లీ దార్లో పడేస్తాయి. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు లేని కారణంగా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.