Karumuri Venkata Reddy: వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్.. అంబటి రాంబాబు ఫైర్

Karumuri Venkata Reddy Arrested YSRCP Leader Ambati Rambabu Fires
  • హైదరాబాద్‌లోని నివాసంలో వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • నోటీసులు ఇవ్వలేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
  • ఇది అక్రమ అరెస్ట్ అంటూ మండిపడ్డ అంబటి రాంబాబు
వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన తాడిపత్రి పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. మరోవైపు, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అరెస్ట్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై ఆయన మండిపడ్డారు. వెంకటరెడ్డిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. "ఆయనను తాడిపత్రికి తీసుకెళ్లారని తెలిసింది. కానీ అరెస్ట్‌కు గల కారణాలను పోలీసులు వెల్లడించకపోవడం దారుణం. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగింది" అని అంబటి విమర్శించారు.

వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో నిజం ఉందో లేదో ప్రభుత్వం పరిశీలించాలి కానీ, ఇలా అరెస్ట్ చేయడం భయంకరమైన ధోరణి అని అంబటి అన్నారు. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణకు వెళుతూ మరణించిన సీఐ సతీశ్ కుమార్ ఘటనపై మాట్లాడితే అరెస్ట్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశిస్తేనే పోలీసులు అరెస్టులు చేస్తున్నారా? అని నిలదీశారు. కొందరు పోలీసు అధికారుల తీరు మారకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో, ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Karumuri Venkata Reddy
Ambati Rambabu
YSRCP
Andhra Pradesh Police
Tadipatri
Arrest
TTD Parakamani Case
CI Satish Kumar
Chandrababu Naidu
Lokesh

More Telugu News