షామీర్ పేటలో చైన్ స్నాచింగ్.. వీడియో ఇదిగో!

  • జనం చూస్తుండగానే మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ ఎత్తుకెళ్లిన దొంగలు
  • సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన చోరీ
  • దొంగలను వెంటాడే క్రమంలో కింద పడ్డ మహిళ
హైదరాబాద్ లో పట్టపగలు, జనం చూస్తుండగానే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన దొంగలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో చోటుచేసుకుందీ ఘటన. చుట్టూ దుకాణాలు, కాస్త దూరంలో జనం తిరుగుతున్నా దొంగలు వెరవలేదు. మహిళ పక్క నుంచే బైక్ ను తీసుకెళ్లి ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని తెంపుకెళ్లారు. ఎదురుగా ఉన్న షాపులోని సీసీకెమెరాలో ఈ చోరీ ఘటన రికార్డైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంటలోని ఓ పాఠశాలలో మల్కారం జమున ఆయాగా పనిచేస్తోంది. ఇటీవల అనారోగ్యం కారణంగా కొంతకాలం స్కూలుకు వెళ్లలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి సర్టిఫికెట్ తీసుకొని స్కూలుకు బయలుదేరింది. ఇంతలో బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయారు. దుండగులు కర్చీఫ్ కట్టుకోవడంతో ముఖాలు కనిపించలేదని, బైక్ నెంబర్ ఆధారంగా వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


More Telugu News