భార్య హేళనే కారణం.. 'ఐబొమ్మ' రవి వెనుక ఉన్న అసలు కథ ఇదే!

  • పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్
  • భార్య, అత్తగారి హేళనతోనే పైరసీ వెబ్‌సైట్‌కు శ్రీకారం
  • రూ. 20 కోట్లు సంపాదించిన రవి
కొత్త సినిమాలను పైరసీ చేస్తూ, తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలుగజేస్తున్న 'ఐబొమ్మ' నిర్వాహకుడు రవి ఇమ్మడి ప్రస్తుతం జైలులో వున్న సంగతి విదితమే. 'దమ్ముంటే పట్టుకోండి చూద్దాం' అంటూ ఆమధ్య పోలీసులకే సవాల్ విసిరి, ఎట్టకేలకు పట్టుబడిన రవి పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించాడు. భార్య, అత్త నుంచి ఎదురైన అవమానాలే అతడిని ఈ నేర మార్గం వైపు నడిపించినట్లు విచారణలో తేలింది.

వివరాల్లోకి వెళితే, వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్న రవి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, తన సంపాదన సరిపోవడం లేదని, డబ్బు సంపాదించడం చేతకాదంటూ భార్య, అత్త హేళన చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. డబ్బు సంపాదించాలనే కసితో తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి 'ఐబొమ్మ', 'బప్పం టీవీ' వంటి పైరసీ వెబ్‌సైట్లను సృష్టించాడు.

కొద్ది కాలంలోనే ఈ వెబ్‌సైట్లకు బెట్టింగ్ యాప్‌ల నుంచి భారీగా ప్రకటనలు రావడంతో ఊహించనంత డబ్బు సంపాదించాడు. కానీ, అతనితో కలిసి జీవించేందుకు భార్య నిరాకరించడంతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం తన మకాం నెదర్లాండ్స్‌కు మార్చి, అక్కడి నుంచే వెబ్‌సైట్లను నిర్వహించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు, గేమింగ్ ముఠాలకు అమ్మి రూ.20 కోట్లు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు.

కూకట్‌పల్లిలోని తన ఫ్లాట్‌ను విక్రయించి, ఆ సొమ్ముతో విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడాలనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చిన రవిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చట్టానికి సవాల్ విసిరే ఏ నేరస్థుడైనా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఉచితంగా సినిమాలు చూపిస్తున్నారంటే దాని వెనుక యూజర్ల డేటాను దొంగిలించే చీకటి కోణం ఉంటుందని, ప్రజలు ఇలాంటి పైరసీ వెబ్‌సైట్లను ప్రోత్సహించవద్దని ఆయన సూచించారు.


More Telugu News