గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు.. హైదరాబాద్‌లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు

  • గ్యాంగ్ లీడర్‌కు వ్యతిరేకంగా హిజ్రాల నిరసన
  • బోరబండలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
  • ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఏడుగురికి తీవ్ర గాయాలు
  • బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరం
హైదరాబాద్‌లోని బోరబండలో హిజ్రాలు నిర్వహించిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు హిజ్రాలు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాంగ్ లీడర్ మోనాలిసా తమపై దాడి చేస్తోందంటూ పలువురు హిజ్రాలు ఈ నిరసన చేపట్టారు. బోరబండ ప్రాంతంలో గ్యాంగ్ లీడర్‌గా ఉన్న మోనాలిసా వర్గానికి, పద్మ వర్గానికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మోనాలిసా తమపై దాడులు చేస్తూ, వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ పద్మ వర్గానికి చెందిన హిజ్రాలు సోమవారం బోరబండ బస్టాప్ వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు.

సుమారు గంటపాటు నిరసన తెలిపిన తర్వాత, వారు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నారు. లైటర్లతో నిప్పు అంటించి, ఆర్పుతూ ఆత్మహత్యాయత్నం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో అప్పారావు (57 శాతం), హీనా ఖాతూన్ (54శాతం), నవనీత (54 శాతం), సాయిశ్రీ (42 శాతం), మోక్షిత (42శాతం), దీపా సుధ (36శాతం), ప్రవళిక (18 శాతం), దివ్యశ్రీ (8 శాతం) తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే మోతీనగర్‌లోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు డీసీపీ గోవర్ధన్, పంజాగుట్ట ఏసీపీ మురళీధర్, ఇతర పోలీస్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News