స్వగృహ ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన.. ... తెలంగాణ సర్కారుకు భారీగా ఆదాయం

  • తొర్రూరులో గజం అత్యధికంగా రూ.39 వేలు పలికిన ధర
  • తొలిరోజు వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.46 కోట్ల ఆదాయం
  • నేడు కూడా కొనసాగనున్న ప్లాట్ల విక్రయాలు
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) సమీపంలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ చేపట్టిన ఓపెన్‌ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది. నిన్న జరిగిన తొలిరోజు వేలంలో తొర్రూర్‌లోని ప్లాట్లను కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు పోటీపడ్డారు. ఈ క్రమంలో ఒక ప్లాటులో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.39,000 పలికింది.

ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉన్న తొర్రూర్‌, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి ప్రాంతాల్లో మొత్తం 163 ప్లాట్ల విక్రయానికి స్వగృహ కార్పొరేషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా నిన్న తొర్రూర్‌లోని 59 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ప్రభుత్వం చదరపు గజానికి కనీస ధర రూ.25,000గా నిర్ణయించగా, సగటున రూ.28,700 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఈ వేలంలో దాదాపు 110 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.

సోమవారం నాటి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.46 కోట్ల ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ వెల్లడించారు. మంగళవారం కూడా వేలం కొనసాగుతుందని, తొర్రూర్‌లోని మిగిలిన 65 ప్లాట్లు, కుర్మల్‌గూడలోని 25, బహదూర్‌పల్లిలోని 13 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. 


More Telugu News