షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు.. స్పందించిన మహ్మద్ యూనస్

  • గత ఏడాది జరిగిన అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష
  • చట్టానికి ఎవరు అతీతులు కాదన్న యూనస్
  • తీర్పు వెలువడిన సమయంలో చప్పట్లతో మార్మోగిన హాలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ స్పందించారు. ఈ తీర్పును ఆయన స్వాగతించారు. చట్టం అందరికీ సమానమేనని ఆయన పేర్కొన్నారు. "అధికారంతో సంబంధం లేకుండా ఎవరూ చట్టానికి అతీతులు కారు అని ఈ తీర్పు స్పష్టం చేసింది" అని ఆయన తెలిపారు.

గత సంవత్సరం బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో, షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్‌మామున్‌లు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ తీర్పులో పేర్కొంది.

హత్య, హత్యాయత్నం, హింసతో పాటు ఇతర అమానవీయ చర్యలకు వారు పాల్పడినట్లు ట్రైబ్యునల్ పేర్కొంది. షేక్ హసీనాకు మరణశిక్ష విధించినట్లు ట్రైబ్యునల్ తీర్పు వెలువరించిన సమయంలో కోర్టు హాలు చప్పట్లతో మార్మోగింది. చాలామంది ఈ తీర్పును స్వాగతించగా, కోర్టు హాలులోపల ఉన్న కొంతమంది కంటతడి పెడుతూ కనిపించారు.


More Telugu News